యాప్నగరం

Huzurnagar Bypoll: కేసీఆర్ బహిరంగ సభ.. ట్రెండ్ సెట్ చేయడం ఖాయమట!

హుజూర్‌నగర్‌లో గురువారం గులాబీ బాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ట్రెండ్ సెట్టింగ్ సభ అవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నిజంగానే కారు దూసుకెళ్తుందా లేదా అనేది అక్టోబర్ 24న తేలనుంది.

Samayam Telugu 16 Oct 2019, 11:48 am
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నాయి. తమకు కంచుకోట లాంటి హుజూర్‌నగర్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల బరిలో ఉత్సాహంగా దూకే టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా ఉత్తమ్ ఫ్యామిలీకి చెక్ పెట్టడం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ప్రచారానికి తుది గడువు దగ్గర పడుతున్న తరుణంలో.. గురువారం సీఎం కేసీఆర్‌‌తో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Samayam Telugu kcr trs


ఈ సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఈ సభను ట్రెండ్ సెట్టింగ్ సభ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటేస్తారన్నారు.

హుజూర్‌నగర్లో గెలిచి తీరుతామని టీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్‌ కేడర్ బలంగా ఉన్నప్పటికీ.. ఎన్నికల ముందు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. ఇది తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో నేతలను మోహరించింది.

ముందుగా టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలతో మద్దతు ఉపసంహరించుకుంది. కానీ ఈ ప్రభావం తమ మీద ఉండబోదని.. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. ఈ ఎన్నికలో బరిలో దిగుతుండటం తమకు కలిసొస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. హుజూర్‌నగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించిన తర్వాత.. కారు టాప్ గేర్‌లో దూసుకెళ్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది అక్టోబర్ 24న తేలనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.