యాప్నగరం

కాంగ్రెస్‌ను వీడటమే ఆశ్చర్యం అంటున్న డీఎస్.. కేసీఆర్‌పై సెటైర్

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై టీఆర్‌ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై సెటైర్ వేశారు. అమిత్ షాను కలవడాన్ని సమర్థించుకున్నారు.

Samayam Telugu 26 Sep 2019, 11:24 pm
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్‌ను వీడటమే ఆశ్చర్యకర అంశమని వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన సమయం వస్తే ఎవరు ఆపినా ఆగదని స్పష్టం చేశారు. ఇటీవలే బీజేపీ అధినేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన అంశంపై ఆయన స్పందించారు. గురువారం (సెప్టెంబర్ 26) ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ds


హోంమంత్రి కాబట్టే అమిత్ షాను కలిశానని డీఎస్ వెల్లడించారు. ఆయణ్ని పార్లమెంటులో మాత్రమే కలిశానని.. బీజేపీ ఆఫీస్‌లో కాదని చెప్పారు. ప్రాంత సమస్యలపై ఎవరైనా, ఎవరినైనా కలవొచ్చని సమర్థించుకున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు తనపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసి ఏడాదిన్నర కాలం అయిపోందని గుర్తుచేశారు. ఆ ఆరోపణలపై ఆయన చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

‘తప్పు చేశానని నాపై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. నిజంగా తప్పు చేస్తే.. టీఆర్ఎస్ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతోంది’ అని డీఎస్ ప్రశ్నించారు. తన కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచాడనీ.. తన సిద్ధాంతాలు తనకు ఉంటాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందని చెప్పారు.

తాను చాలా తక్కువగా మాట్లాడతానని చెప్పిన డీఎస్.. అనవసరంగా దేనిపైనా స్పందించనని స్పష్టం చేశారు. ఏదైనా స్పందించాల్సి వస్తే గట్టిగానే మాట్లాడతానని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తాను చేయాల్సింది చేశానని చెప్పారు.

హుజూర్ నగర్‌ ఉపఎన్నిక అంశంపైనా డీఎస్ స్పందించారు. అక్కడ రాజకీయం వేరుగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ సమయంలో ఎలా తీర్పు ఇస్తారో ఊహించలేం అన్నారు.

బీజేపీలో ఉన్న తన కుమారుడు అరవింద్‌కు డీఎస్ రాజకీయంగా సహకరిస్తున్నారంటూ.. గతంలో నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు, ఎంపీ కవిత ఆయనపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి డీఎస్ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను దూరంగా ఉంటూ వచ్చారు. అయితే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలుపొందడంతో.. డీఎస్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన అమిత్ షాను కలవడం దీనికి మరింత ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో డీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.