యాప్నగరం

Huzurnagar Bypoll: అటు నుంచి నరుక్కొస్తున్న కేసీఆర్, వ్యూహం వర్కౌట్ అయ్యేనా?

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. కాంగ్రెస్‌ను ఒంటరి చేసే లక్ష్యంతో పావులు కదుపుతోంది. సీపీఐని తనవైపు తిప్పుకోవడానికి గులాబీ దండు ప్రయత్నిస్తోంది.

Samayam Telugu 29 Sep 2019, 6:10 pm
తెలంగాణలోని ప్రధాన పార్టీలు హుజూర్ నగర్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, టీడీపీ తదితర పార్టీలు రంగంలోకి దిగాయి. పార్టీలే కాకుండా సర్పంచ్‌లు, లాయర్లు కూడా భారీ సంఖ్యలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎంత మంది బరిలో దిగినా పోటీ మాత్రం ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కంచుకోట లాంటి హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌‌ను ఓడించాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందుకే భారీగా మంత్రులను, నేతలను మోహరిస్తోంది.
Samayam Telugu kcr trs


సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్న గులాబీ దళం.. కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకుంటోంది. తాను బలపడటంతోపాటు... ప్రత్యర్థిని బలహీనం చేసే ఎత్తుగడలు వేస్తోంది. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మహాకూటమిలోని ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయి.

ఈసారి సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులున్నాయి. టీడీపీ కూడా హుజూర్‌నగర్‌లో బరిలో దిగుతోంది. తెలంగాణలో పార్టీని బతికించుకోవడం కోసం.. కాంగ్రెస్‌తో టీడీపీకి దోస్తీ లేదని స్పష్టం చేయడం కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పోటీకి దిగడం ద్వారా టీడీపీ గెలవలేకపోవచ్చు కానీ.. ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు కాంగ్రెస్‌కు దూరం అవుతాయి. ఇది పరోక్షంగా టీఆర్ఎస్‌కు కలసి వస్తుంది.
అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన సీపీఐని తన వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గులాబీ నేతలు కేకే, నామా నాగేశ్వర రావు, వివేక్ తదితరులు ఆదివారం సీపీఐ నేతలను కలిశారు. తాము మద్దతు ఇచ్చే విషయమై రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని సీపీఐ నేతలు టీఆర్ఎస్ నాయకులకు స్పష్టం చేశారు.వాస్తవానికి హుజూర్‌నగర్‌లో సీపీఐకి పెద్ద బలమేం లేదు. కానీ కమ్యూనిస్టులు మద్దతునిస్తే టీఆర్ఎస్‌కు నైతిక బలం చేకూరుతుంది.

Read Also: హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి

టీఆర్ఎస్ ఓటమి భయంతోనే సీపీఐ మద్దతు కోరుతోందని, గతంలో కేసీఆర్ కమ్యూనిస్టులను ఉద్దేశించి ఏం వ్యాఖ్యానించారో గుర్తు తెచ్చుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహా ఇస్తున్నారు. మొత్తానికి హుజూర్‌నగర్‌లో సీపీఐ ఎవరికి మద్దతునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: హుజూర్‌నగర్‌లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన బీజేపీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.