యాప్నగరం

కోపమొచ్చిన కిషన్ రెడ్డి.. కలెక్టర్, కమిషనర్‌కి గంట టైం.. ఉరుకులు పరుగులు!

హైదరాబాద్ వరదలు ముంచెత్తిన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు కనీసం ఆర్డీవో స్థాయి అధికారి కూడా హాజరుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోమారు అలాంటి అనుభవమే ఎదురవడంతో దిమ్మతిరిగే షాకిచ్చారు.

Samayam Telugu 25 Nov 2021, 2:52 pm
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కోపమొచ్చింది. కలెక్టర్, కమిషనర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇక ఉపేక్షించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారికి గంట టైమిచ్చిన కేంద్ర మంత్రి.. ఈలోగా రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు పంపారు. విషయం తెలిసిన అధికారులు ఉరుకులు పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kishan reddy


నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఈరోజు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ మీటింగ్‌కి హాజరుకాకపోవడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కోపం తెప్పించింది. జిల్లా సమావేశంలో కీలక అధికారులు రాకపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కిషన్ రెడ్డి వెంట కనీసం ఆర్డీవో స్థాయి అధికారులు కూడా హాజరుకాకపోవడంపై నొచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పర్యటనకు వచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలొచ్చాయి. మరోమారు అలాంటి అనుభవమే ఎదురుకావడంతో కిషన్ రెడ్డికి కోపమొచ్చినట్లు తెలుస్తోంది.

కలెక్టర్, కమిషనర్ హాజరుకానప్పుడు సమావేశం ఎందుకు పెట్టారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గంటలో అధికారులు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. సమావేశానికి రాకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు ఉరుకులు, పరుగుల మీద టూరిజం భవన్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నట్లు సమాచారం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.