యాప్నగరం

14 రోజుల్లో తెలుగు నేర్చుకుంటా.. గవర్నర్ తమిళి సై

Telangana | గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. అనంతరం రాజ్‌భవన్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14 రోజుల్లోనే తెలుగు నేర్చుకుంటానని చెప్పారు.

Samayam Telugu 10 Sep 2019, 11:01 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలకు తగిన విధంగా ప్రభుత్వం పరిపాలనను నిర్వహిస్తోందన్నారు. పాలనలో కొత్త పుంతలతో తెలంగాణ దేశంలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి, ఆదర్శరాష్ట్రంగా నిలిచిందని ఆమె ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యపాత్ర పోషిస్తానని, అన్నిరకాలుగా మార్గదర్శిగా నిలుస్తానని తమిళి సై హమీ ఇచ్చారు.
Samayam Telugu Govrnor TimiliSai


రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి పథకాలనను అమలు చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. హరితహారం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను లోపరహితంగా నిర్వహిస్తూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తోందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ ఆకాంక్షలను నెరవేర్చి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజారోగ్యం విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కితాబిచ్చారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా నిర్మిస్తూ రైతులకు మేలు చేస్తోందని గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసి తెలంగాణ ప్రపంచదృష్టిని ఆకర్షించిందని కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నీటిని ప్రజలకు ఉపయోగపడేందుకు వినియోగించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీలో అద్భుత ప్రగతిని సాధించిందని, శాంతిభద్రతల పరిరక్షణ కూడా చాలా బాగుందని ప్రశంసించారు. మెట్రో రైలు సౌకర్యంతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్లాఘించారు.

2018-19లో తెలంగాణ రాష్ట్రం 14.8 శాతం జీఎస్డీపీని సాధించిందని, 2014లో 4లక్షల కోట్లు ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకోవడం గర్వకారణమన్నారు తమిళిసై. 2018-19లో తెలంగాణ రాష్ట్రం 14.8 శాతం జీఎస్డీపీని సాధించిందని, 2014లో రూ. 4 లక్షల కోట్లు ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకోవడం ప్రశంసనీయమని చెప్పారు. అనంతరం ప్రజలకు వినాయక చవితి, ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. తెలంగాణకు గవర్నర్‌గా వచ్చే ముందే, రాష్ట్ర సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేశానని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు భాషను 14 రోజుల్లోనే నేర్చుకుంటాననే నమ్మకం ఉందని తెలిపారు.
స్థానిక ప్రజలతో తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తాను ప్రతిరోజూ యోగాచేస్తానని, క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తానని తెలిపారు. రాజ్‌భవన్ సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలిగిన తమిళి సై.. వారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. విధులు పక్కాగా నిర్వర్తించాలని సూచించారు. అనంతరం రాజ్‌భవన్ లైబ్రరీని పరిశీలించిన ఆమె.. తన వ్యక్తిగత లైబ్రరీలోని పుస్తకాలను కూడా త్వరలోనే రాజ్‌భవన్‌కు తీసుకొస్తానని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.