యాప్నగరం

Rajendranagar: దుర్గమ్మ నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో మునిగి యువకుడు మృతి

Rajendranagar: పండుగ పూట విషాదం నెలకొంది. దుర్గమాతను నిమజ్జం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్‌లో చోటుచేసుకుంది. యువకుడికి ఈత రాకపోవటం.. అందులోని పై నుంచి అమ్మవారి విగ్రహం పడటంతో.. ఊపిరాడక యువకుడు మరణించాడు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 6 Oct 2022, 4:28 pm
Rajendranagar: రాజేంద్రనగర్‌లో నిర్వహించిన దుర్గాదేవి నిమజ్జనం (Kanakadurga immersion) లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ధూం ధాంగా శోభాయాత్ర నిర్వహించి.. తీరా నిమజ్జనం చేసే సమయంలో ఓ యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. చెరువంతా గాలించగా.. విగతజీవిగా దొరికాడు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాంత్ అనే యువకుడి కుటుంబం.. ఇంట్లో దుర్గామాతను ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నవరాత్రులు పూర్తయిన సందర్భంగా.. దుర్గామాతను రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్‌ (Himayat Sagar) లో నిమజ్జనం చేయడానికి శ్రీకాంత్‌తో పాటు అతని అన్నయ్య కూడా వచ్చాడు.
Samayam Telugu durgamma
దుర్గమ్మ నిమజ్జనం


హిమాయత్‌సాగర్ చెరువులో శ్రీకాంత్.. దుర్గమ్మను నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కాలు జారి చెరువులో పడ్డాడు. అతడిపై నుంచి దుర్గామాత విగ్రహం కూడా పడిపోయింది. దీంతో.. శ్రీకాంత్ నీళ్లలో మునిగిపోయాడు. అది గమనించిన శ్రీకాంత్ అన్న.. వెంటనే కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ.. అప్పటికే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ గల్లంతయ్యాడు. అందులోనూ.. శ్రీకాంత్‌కు ఈత రాకపోవడంతో పూర్తిగా మునిగిపోయాడు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో.. గాలింపు చేపట్టారు. రాత్రి భారీ వర్షం పడడం వల్ల వాతావరణం సహకరించ లేదు. పైగా పెద్ద ఎత్తున వరద నీరు చెరువులోకి చేరుతోంది. ఉదయం మళ్లీ గాలించిన ఈతగాళ్లకు శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. శ్రీకాంత్ మృతి విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.