యాప్నగరం

Raj Kundra: తీర్పు ఆలస్యమైతే న్యాయం జరగనట్టే.. శిల్పాశెట్టి భర్త నిర్దోషి అంటోన్న లాయర్

నీలి చిత్రాల చిత్రీకరణ, పంపిణీ ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) 2021లో అరెస్ట్ అయ్యారు. 2021లో రాజ్ కుంద్రా పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈయన శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త కావడంతో ఆమెను కూడా నెటిజనులు టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 13 Apr 2023, 6:52 pm

ప్రధానాంశాలు:

  • నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజ్ కుంద్రా
  • కోర్టు విచారణ కోసం వేచి చూస్తున్న శిల్పా శెట్టి భర్త
  • ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ ట్రయిల్స్ జరగాలని కోరుతోన్న లాయర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raj Kundra and Shilpa Shetty
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) అడల్ట్ కంటెంట్ (నీలి చిత్రాలు) కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా ముంబైలో నీలి చిత్రాలను చిత్రీకరించి, వాటిని పంపిణీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2021లో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్. సుమారు మూడు నెలలు రాజ్ కుంద్రా జైలులో ఊచలు లెక్కపెట్టారు. బెయిల్‌పై విడుదలైన రాజ్ కుంద్రా రెండేళ్లుగా కోర్టులో కేసు విచారణ కోసం వేచి చూస్తున్నారు. అయితే, ఈ విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజ్ కుంద్రా లాయర్ ప్రశాంత్ పాటిల్. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ ట్రయిల్ జరపాలని కోరుతున్నారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘నా క్లయింట్ రాజ్ కుంద్రా ఒక తప్పుడు కేసులో బాధితుడు. సంవత్సరాలు గడిచిపోతున్నా కోర్టులో విచారణ మాత్రం ఇంకా మొదలుకాలేదు. ట్రయల్ కోర్టు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, విచారణను ఆలస్యం చేయడానికి ప్రాసిక్యూషన్ ఆసక్తి చూపుతున్నట్టు అనిపిస్తోంది. నిజం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఓ వర్గం మీడియా నా క్లయింట్‌ను ఇప్పటికే ‘దోషి’గా చిత్రీకరించింది. పోలీసులు రూపొందించిన ఛార్జ్‌ షీట్‌లో ఉన్న అంశాలనే నిజంగా భావిస్తోంది. నిజానికి నా క్లయింట్ రాజ్ కుంద్రాపై చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదు’ అని న్యాయవాది ప్రశాంత్ పాటిల్ పేర్కొన్నారు.

ఈ కేసులో రాజ్ కుంద్రా న్యాయమైన, వేగవంతమైన విచారణను ఎదుర్కోకుండా అడ్డుకుని ఆయన ప్రాథమిక హక్కను కాలరాశారని ప్రశాంత్ ఆరోపించారు. ‘న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రోజువారీ ప్రాతిపదికన విచారణ జరపాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాం. నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు రుజువైతే కోర్టు ఆయన్ని శిక్షిస్తుంది. కానీ, నా క్లయింట్ అమాయకుడు, ఏ తప్పూ చేయలేదు అని తేలితే ఆయన మీద ఉన్న తప్పుడు ఆరోపణలన్నీ తుడుచుపెట్టుకుపోతాయి. తీర్పు ఆలస్యమైతే న్యాయం జరగనట్టే. ఇప్పటికైనా కేసు విచారణ మొదలవుతుందని ఆశిస్తున్నాం’ అని ప్రశాంత్ వెల్లడించారు.

కాగా, రాజ్ కుంద్రా 2021 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నారు. తన జీవితంలో తాను ఎప్పుడూ ‘పోర్నోగ్రఫీ’ చిత్రీకరణ, పంపిణీలో పాలుపంచుకోలేదని శిల్పా శెట్టి భర్త వివరణ ఇచ్చారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం రాజ్ కుంద్రాపై చాలా నెగిటివిటీ ఉంది. ఆయన తప్పుచేసినట్టే చాలా మంది నమ్ముతున్నారు. కోర్టు తీర్పు వెలువడితే తప్ప ఆయన దోషా, నిర్దోషా అనే విషయాలు తెలియవు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.