యాప్నగరం

Same Sex Marriage - స్వలింగ వివాహం ఒక అవసరం, నేరం కాదు: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

స్వలింగ వివాహంపై (Same sex marriage) ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తన వాదనను వినిపించారు. స్వలింగ వివాహం అనేది ఇండియా లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశంలో సర్వసాధారణం అవ్వాలని, ఇదొక అవసరమని ఆయన ట్వీట్ చేశారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 18 Apr 2023, 2:04 pm

ప్రధానాంశాలు:

  • స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు
  • పిటిషనర్ల వాదనను మరోసారి వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం
  • కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vivek Agnihotri
వివేక్ అగ్నిహోత్రి
స్వలింగ వివాహం (Same sex marriage) అనేది ‘అర్బన్ ఎలిటిస్ట్’ (తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే వ్యక్తుల) కాన్సెప్ట్ కాదని ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) అన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని తప్పుబడుతూ వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. స్వలింగ వివాహం అనే కాన్సెప్ట్ తప్పే కాదని ఆయన వాదించారు. దీన్ని ఇండియాలో సర్వసాధారణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరగా.. సోమవారం కేంద్ర తన వాదనను వినిపించింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు.. వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను.. ప్రస్తుతమున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాదించింది. ఈ వాదనను వివేక్ అగ్నిహోత్రి వ్యతిరేకించారు.
‘స్వలింగ వివాహం ‘అర్బన్ ఎలిటిస్ట్’ కాన్సెప్ట్ కానేకాదు. మనుషులకు ఇది అవసరం. చిన్న పట్టణాల్లోని, గ్రామాల్లోని లేదంటే ముంబై వీధుల్లోని తిరగని కొంత మంది ప్రభుత్వ ఉన్నత నాగరీకులు ఈ అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. మొట్టమొదటిగా చెప్పే విషయం ఏంటంటే, స్వలింగ వివాహం అనేది అసలు కాన్సెప్టే కాదు. అది అవసరం. అది హక్కు. భారత్ లాంటి ప్రగతిశీల, ఉదారవాద, సమ్మిళిత నాగరికతలో స్వలింగ వివాహాన్ని సర్వసాధారణంగా చూడాలి. ఇది నేరం కాదు’ అని వివేక్ అగ్నిహోత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, వివేక్ అగ్నిహోత్రి వాదనకు నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది వివేక్ వాదనను స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇలాంటి వివాహాలను అస్సలు ఇష్టపడనివారు ‘నోరు మూసుకో వివేక్’ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

నిజానికి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని గతంలోనూ కొందరు సెలబ్రిటీలు గొంతెత్తారు. బాలీవుడ్ ఫిలిం మేకర్ హన్సల్ మెహతా ఇప్పటికే స్వలింగ వివాహం కాన్సెప్ట్‌పై ‘మోడరన్ లవ్: ముంబై’ అనే ఆంథాలజీని రూపొందించారు. ఈయన కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఐదుగురు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హేమ కోహ్లిలతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను మంగళవారం నుంచి విచారించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. స్వలింగ వివాహాన్ని వ్యతిరేకించింది. అయితే కేంద్రం వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. దీనిపై కూడా మంగళవారం విచారణ జరపనుంది.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.