యాప్నగరం

లిఫ్ట్ పనిచేయక కృష్ణ, విజయనిర్మల నిరీక్షణ.. కుట్ర జరుగుతోందన్న నరేష్

ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు.

Samayam Telugu 10 Mar 2019, 1:12 pm
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో ఈ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున సహా ‘మా’లో సభ్యత్వం ఉన్న చాలా మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు. కరెంట్ కోసం వేచిచూస్తున్నారు.
Samayam Telugu Naresh


అధ్యక్ష పోటీలో ఉన్న డాక్టర్ వీకే నరేష్ దీనిపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘వయసు మీదపడినవారు, దివ్యాంగులు లిఫ్ట్ పనిచేయకపోతే ఎలా పైకి వెళ్తారు. చిరంజీవి, కృష్ణగారు లాంటి పెద్దలు వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులో లేరు అంటున్నారు. ఇది కచ్చితంగా కుట్రే’ అని అన్నారు. వాస్తవానికి చాంబర్‌లో జనరేటర్ కూడా ఉంది. ఒకవేళ కరెంట్ పోతే దాన్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ.. కృష్ణ, విజయనిర్మల చాంబర్ వద్దకు వచ్చి గంటకు పైగా అయినా ఇంకా జనరేటర్‌ను స్టార్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజంగా నరేష్ ప్యానెల్‌కు ఓట్లు పడకుండా శివాజీరాజా ప్యానెల్ అడ్డుకుంటోందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈసారి ఎన్నికల్లో సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా నటుడు నరేష్ బరిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. మా అసోషియేషన్‌లో దాదాపు 800 మంది సభ్యులున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.