యాప్నగరం

కేరళ వరద సాయం.. రూ.25 లక్షలు ప్రకటించిన బన్నీ

ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పచ్చదనంతో కళకళలాడే కేరళ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణికిపోయింది.

Samayam Telugu 13 Aug 2018, 5:21 pm
ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పచ్చదనంతో కళకళలాడే కేరళ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణికిపోయింది. భారీ వరదల కారణంగా 37 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే కోలీవుడ్ నటులు ముందుకొచ్చారు. విశాల్, సూర్య, కార్తి, కమల్ హాసన్ తదితరులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆర్థిక సహాయాన్ని అందించారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ రూ.5 లక్షల సాయాన్ని అందజేశారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వరద బాధితులకు తన వంతు సాయాన్ని ప్రకటించారు. రూ.25 లక్షలు దానం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Samayam Telugu Allu_Arjun


కేరళ ప్రజలు ఎప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తారని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాళ్లు తనపై అపారమైన ప్రేమానురాగాలను కురిపిస్తారన్నారు. కేరళ ప్రజలకు తనవంతు సాయంగా రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, భారీ వరదల కారణంగా కేరళ అతలాకుతలమైంది. రోడ్లు కొట్టుకుపోయాయి, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, కట్టడాలు కూలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఏరియల్ సర్వే నిర్వహించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తక్షణమే రూ.100 కోట్లను సాయంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవడానికి రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు చేతులు కలపాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. కేరళ ప్రభుత్వం సాయం కోసం అభ్యర్థిస్తోంది. సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కు సాయం చేయాలని దేశ విదేశాల్లో ఉన్న కేరళ ప్రజానీకాన్ని, ఎన్నారైలను పినరయి విజయన్ అభ్యర్థించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.