యాప్నగరం

విజయ నిర్మలకు నివాళులర్పించి కృష్ణను ఓదార్చిన జగన్

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మల ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Samayam Telugu 28 Jun 2019, 10:43 am
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం తన నివాసం లోటస్‌పాండ్‌‌ నుంచి నానక్‌రామ్‌గూడ‌లోని కృష్ణ నివాసానికి వెళ్లారు. ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. విజయ నిర్మల పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
Samayam Telugu ys-jagan


గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేడు ఆమె పార్ధివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి, అక్కడ కొద్ది సేపు ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చిలుకూరులోని ఫాంహౌస్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల బహుముఖ ప్రతిభ చూపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 200 పైచిలుకు చిత్రాల్లో నటనతో మెప్పించారు. 44 చిత్రాలకి దర్శకత్వం వహించి, 15 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో తొలి చిత్రం మీనాతోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా విజయనిర్మల ‘మచ్ఛరేఖై’ (1953) అనే తమిళ సినిమాలో తొలిసారి నటించిన విజయ నిర్మలకు వితెలుగులో తొలి చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’. మలయాళంలో తొలి హారర్‌ చిత్రం ‘భార్గవి నిలయం’తో కథానాయికగా పరిచయమయ్యారు. తెలుగులో కథానాయికగా ‘రంగులరాట్నం’తో ఆమె ప్రస్థానం ప్రారంభమైంది. కవిత అనే మలయాళ చిత్రంతో ఆమె తొలిసారి దర్శకత్వం వహించారు.

Read Also: నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ.. ఈ ప్రతిపాదనకే జగన్ మొగ్గు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.