యాప్నగరం

జగన్ ప్రభుత్వంపై అశ్వనీదత్ పిటిషన్.. ఆ శాఖలకు హైకోర్టు ఆదేశాలు

అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.

Samayam Telugu 13 Oct 2020, 5:55 pm
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో జరిగిన భూ సమీకరణలో తనకు అన్యాయం జరిగిందంటూ ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.
Samayam Telugu అశ్వనీదత్
Ashwini Dutt


గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ కింద గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అశ్వనీదత్ 39 ఎకరాలు ఇచ్చారు. ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని అశ్వనీదత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని తెలిపారు.

నిజానికి అప్పటి ప్రభుత్వం అశ్వనీదత్‌కు అమరావతిలో ప్లాట్ ఇచ్చింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి వైదొలిగి తనకు నష్టం చేకూర్చిందని అశ్వనీదత్ కోర్టుకు తెలిపారు. ఏడాదిగా అశ్వనీదత్‌ భూమికి లీజ్ కూడా చెల్లించలేదని ఆయన న్యాయవాది జంధ్యాల రవి శంకర్ కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్‌పై ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 3 కి వాయిదా వేసింది.

కాగా, ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించడం వల్ల అమరావతిలో ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్ వాపోతున్నారు. తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ అశ్వనీదత్ ఈ పిటిషన్ వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.