Director Satish Vignesh Interview About Kalyan Ram Entha Manchivaadavuraa Movie
‘ఎంత మంచివాడవురా!’.. ఆ తప్పు మళ్లీ చేయను: సతీష్ వేగేశ్న ఇంటర్వ్యూ
ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా విడుదలై హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక ఇదే ఊపులో మూడు పెద్ద చిత్రాలతో పోటీ పడుతూ.. జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా! అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.
Samayam Telugu15 Jan 2020, 7:52 am
ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా విడుదలై హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక ఇదే ఊపులో మూడు పెద్ద చిత్రాలతో పోటీ పడుతూ.. జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా! అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.
నేషనల్ అవార్డ్ డైరెక్టర్
‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ అవార్డుని అందుకున్నారు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడవురా`. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా సంక్రాంతి సీజన్లో విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ మూవీ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్నతో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.
సంక్రాంతి సతీశ్‌గా మారారా? ఈ చిత్రంతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు?
సంక్రాంతి సతీష్ అనేం లేదంటే.. సంక్రాంతికి విడుదలవుతున్న నా రెండో చిత్రమిది. మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. మంచి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కోరుకునదే. ప్రపంచంలో ఉండేదే. ఇందులో హీరో క్యారెక్టర్ ఎదుటివారికి ఏదైనా సమస్య, బాధ ఉంటే దాన్ని తగ్గించే క్యారెక్టర్. తన క్యారెక్టర్‌ను బేస్ చేసుకునే ఈ టైటిల్‌ను పెట్టాం. ఒక మనిషికి ప్రేమ, ఆప్యాయతను పంచాలంటే వారు మన బంధువులు, స్నేహితులే కానవసరం లేదు. సమస్యల్లో ఉండేవారికి మనం ప్రేమ, ఆప్యాయతలు ఇచ్చి సంతోషపడినప్పుడు వారూ మన మనసుకు చుట్టాలే.
కథ రాసుకున్న తర్వాత హీరోగారిని కలిశారా? లేక హీరోను కలిసిన తర్వాత ఈ కథను రాసుకున్నారా?
కథ కోసమే కల్యాణ్‌రామ్‌గారండి. హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటే ఎక్కడో ఒకచోట వారి ఇమేజ్ కోసం మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అదే కథ రాసుకున్న తర్వాత ఏ హీరో అయితే బావుంటాడని అనుకుని వారిని సంప్రదించి ఒప్పిస్తే.. తర్వాత చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేసుకోవచ్చు.
ఈ కథకు కల్యాణ్‌రామ్ ఎలా యాప్ట్ అవుతారనిపించింది?
ఎప్పుడూ ఓ జోనర్లో సినిమాలు చేసేవారు డిఫరెంట్‌గా చేస్తే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకు కల్యాణ్‌రామ్‌గారు చాలా యాక్షన్ సినిమాలు చేశారు. ఆయనతో నేను మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తిగా అనిపించదు. అదే నేను ఓ కూల్ సినిమా చేస్తే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. అలాగే నా కథకు ఓ మెచ్యూర్డ్ వ్యక్తి అవసరం. అప్పుడు నాకు కల్యాణ్‌రామ్‌గారే ఐడియాకు వచ్చారు. కల్యాణ్‌రామ్‌గారు అన్‌స్క్రీన్ కోపంగా కనపడతారు. కానీ.. ఆఫ్ స్క్రీన్ చాలా కూల్‌గా, నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఆయన్ని కలిశాను. ఆయన్ని కలిసి కథ చెప్పగానే ఆయనకు నచ్చింది.
మంచి గురించి చెప్పేటప్పుడు యాక్షన్ ఎలిమెంట్స్ ఎందుకు?
నా గత రెండు చిత్రాల్లో యాక్షన్ చేయడానికి స్కోప్ లేదు. అవకాశం కూడా లేదు. కానీ ఈ సినిమాలో కథానుగుణంగా యాక్షన్ అసవరమైంది. కల్యాణ్‌రామ్‌గారి కోసం నా పంథాను మార్చుకోలేదు. కథలో అవసరం మేరకు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాను. అంతే తప్ప నేను యాక్షన్ సినిమాలు చేయగలనని నిరూపించుకోవడానికి ఈ సినిమా చేయలేదు.
మీ గత చిత్రానికి, దీనికి డిఫరెన్స్ ఏంటి?
సంప్రదాయాలను ఎక్కడో వదిలేస్తున్నాం.. పెళ్లి గురించి చెప్పాలని చేశాను. శ్రీనివాస కల్యాణంతో మనకు తెలిసిన దాన్ని నలుగురు చెప్పాలి అనడం కోసం సినిమా చేయకూడదనే విషయం తెలిసింది. ఆ తప్పు మళ్లీ చేయను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేయాలని చేసిన సినిమా.
రీమేక్ చేయడం వెనుక కారణమేంటి?
నిజానికి నా దగ్గర చాలా కథలున్నాయి. రీమేక్ చేయాలనే ఆలోచన లేదు. ఆ సమయంలో నిర్మాత ఉమేష్ గుప్తగారికి ఆయన స్నేహితుడు గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ గురించి చెప్పాడట. ఆయన కృష్ణ ప్రసాద్‌గారికి చెప్పాడట. ఆయన బేసిక్‌గానే రైటర్ ఆయనకు నచ్చుతుందో లేదో అని అన్నారట. సరే..ఓసారి ఆ సినిమాను చూడమనండి అని ఉమేష్‌గారు అన్నారట. కృష్ణప్రసాద్‌గారు నాకు విషయం చెప్పగానే నేను మంచి సినిమా అయితే చేద్దాం సార్... ముందుగానే ఆ సినిమా కోర్ పాయింట్ బాగా నచ్చింది. చాలా చేంజస్ చేయాలని చెప్పాను. తెలుగు నెటివిటీ ప్రకారం కథను వీలైనంత మార్చేస్తా అని అన్నాను. నిర్మాతలు ఒప్పుకోవడంతో సినిమా స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మన చుట్టూ పిల్లలకు దూరంగా ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని మనం పలకరిస్తే వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు అనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాం. ఈ సినిమాను చేసేటప్పుడు నేను పెద్దగా ఏం ఆలోచించలేదు. ఏ సినిమాకైనా ఓ భయముంటుంది. కానీ సినిమా రన్నింగ్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ మనకు కాన్ఫిడెంట్‌నిస్తుంది. ఈ సినిమాలో అలాంటి ఫీడ్ బ్యాక్ చాలానే వచ్చింది.
మెహరీన్‌ని హీరోయిన్గా తీసుకోవడానికి రీజనేంటి?
మెహరీన్ ఎఫ్ 2లో చక్కగా నటించింది. కామెడీ బాగా చేసింది. ఎవరైతే కామెడీ బాగా చేస్తారో వారు ఎమోషన్స్ కూడా బాగా పండిస్తారు. అందుకనే మెహరీన్‌ని హీరోయిన్గా తీసుకున్నాం.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనే ఇమేజ్ మీకు ప్లస్సా, మైనస్సా? మీ నెక్ట్స్ మూవీ?
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిపించుకోవడం ఖచ్చితంగా ప్లస్ అవుతుందండీ.. ఈ సినిమా కూడా ఆ కోవలోనిదే. ‘ఎంత మంచివాడవురా’ రిలీజ్ తర్వాత తర్వాత చిత్రం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.