యాప్నగరం

ప్రముఖ దర్శకుడు శివ తండ్రి కన్నుమూత

‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శివ.. ‘సిరుతాయి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అక్కడ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

Samayam Telugu 28 Nov 2020, 6:01 pm
ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. జయకుమార్ షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. 400కు పైగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు జయకుమార్ ఖాతాలో ఉన్నాయి. జయకుమార్‌కు శివ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు బాల నటుడిగా, దర్శకుడిగా మలయాళ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కుమార్తె విదేశాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు.
Samayam Telugu జయకుమార్, శివ
Director Siva father Jayakumar


జయకుమార్ చాలా ఏళ్లుగా చెన్నైలోని విరుగంబాక్కంలో ఉంటున్నారు. చుట్టుపక్కల వారి బాగోగులు చూసుకోవడం, సామాజిక సేవలో జయకుమార్గా యాక్టివ్‌గా ఉండేవారు. జయకుమార్ తండ్రి వేలన్ కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా సినీ పరిశ్రమకు సేవలందించారు.

ఇక జయకుమార్ పెద్ద కుమారుడు శివ మొదట సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగులో ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’, ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’, ‘బాస్’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అయితే, 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరవాత వరసగా ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో శివకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, తమిళంలో మాత్రం స్టార్ డైరెక్టర్ హోదాను పొందారు.

కార్తి హీరోగా వచ్చిన ‘సిరుతాయి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ.. అక్కడ ఆరంగేట్ర చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ తరవాత స్టార్ హీరో అజిత్‌తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ చిత్రాలను అందించి శివ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘అన్నాతే’ సినిమాను రూపొందిస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.