యాప్నగరం

నిబంధనలను అతిక్రమించిన నాగశౌర్య.. జరిమానా విధించిన పోలీసులు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు హీరో నాగశౌర్యకు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు ఫైన్ వేశారు.

Samayam Telugu 13 Aug 2019, 6:48 pm
యంగ్ హీరో నాగశౌర్య ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించారు. కారులోపల వ్యక్తులు కనిపించకుండా, సూర్య రశ్మి పడకుండా ఉండేందుకు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (టింటెడ్ గ్లాస్) వేయించుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీంతో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు నాగశౌర్యకు రూ.500 జరిమానా విధించారు.
Samayam Telugu Naga-Shourya


నాగశౌర్య తన ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 మీదుగా మంగళవారం వెళ్తున్నారు. ఆయన కారు అద్దాలు ట్రాన్సపరెంట్‌గా కాకుండా బ్లాక్ ఫిల్మ్‌తో ఉండటంతో పోలీసులు ఆపారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేసి జరిమానా వేశారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరి.

ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు మోటార్ వెహికల్ నిబంధనను అతిక్రమించారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నితిన్, సునీల్‌లకు గతంలో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ఇటీవలే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు పోలీసులు ఫైన్ వేశారు. మూసాపేట శ్రీరాములు థియేటర్‌ వద్ద వర్మ తన సహదర్శకులతో కలిసి బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. దీంతో ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని పోలీసులు వర్మకు రూ.1350 జరిమానా విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.