యాప్నగరం

Jana Sena: జీరో బడ్జెట్‌తో పోటీ చేస్తున్నారు.. జనసేనకు హీరో నిఖిల్ సపోర్ట్

జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా చేరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు.

Samayam Telugu 10 Apr 2019, 9:59 am
ప్రస్తుత ఎన్నికల్లో సినీ నటుల ప్రమేయం ఎక్కువైందనే చెప్పాలి. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సినీ నటులు ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎక్కువ మంది సినీ నటులు ప్రజల వద్దకు వెళ్లి జగన్‌ను గెలిపించాలని కోరారు. జీవిత, రాజశేఖర్, అలీ, పోసాని క్రిష్ణమురళి, పృథ్వీ, శ్యామల లాంటి వారు వైసీపీకి ప్రచారం కల్పించారు. మరోవైపు టీడీపీకి నారా రోహిత్, దివ్యవాణి, తారకరత్న ప్రచారం చేశారు. ఇక జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ కూడా ఒక సినీనటుడు. ఆయన ఇమేజే జనసేనకు కొండంత బలం. అయినప్పటికీ జనసేన తరఫున కూడా సినీ నటులు ప్రచారం చేశారు.
Samayam Telugu Nikhil


ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రామ్ చరణ్ తన మద్దతు తెలిపారు. ఇక అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లి జనసేనాని సభలో పాల్గొన్నారు. వరుణ్ తేజ్, నిహారిక స్వయంగా తన తండ్రి నాగబాబు కోసం నరసాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు ‘జబర్దస్త్’ టీం జనసేన గెలుపు కోసం నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో గ్రామాలన్నీ తిరిగి ప్రచారం చేసింది. ఇలా జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా చేరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు. లక్ష్మీనారాయణ ప్రజలకు సమర్పించిన వాగ్దానాలతో కూడి బాండ్ పేపర్‌ను నిఖిల్ పరిశీలించారు. ఈ మేరకు లక్ష్మీనారాయణను కలిసిన ఫొటోలను ట్విట్టర్‌లో ఉంచారు.

‘ప్రతి ఆర్టిస్ట్ నా ఫ్యామిలీ అని గతంలో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్‌కి సపోర్ట్ చేస్తూ, తన పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గారిని కలిసి పోల్ ప్రామిస్ అఫిడవిట్ గురించి మాట్లాడాను. శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ విధంగా రాజకీయనాయకుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం ఇదే తొలిసారి’ అని నిఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అలాగే పలువురు జనసైనికులతో పాటు విశాఖపట్నంలోని భీమిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచర్ల సందీప్‌ను కూడా కలిసినట్లు నిఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సందీప్ చాలా మంచి నేపథ్యం నుంచి వచ్చారని వెల్లడించారు. కనీసం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని కొనియాడారు. ‘డబ్బులులేని సామాన్యులు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అవ్వొచ్చని ఇప్పటికీ నమ్మకం కలుగుతోంది. థ్యాంక్స్ పవర్ స్టార్’ అంటూ నిఖిల్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.