యాప్నగరం

Puri Jagannadh: కొత్తవాడైన పూరీకి పవన్ అవకాశం ఎలా ఇచ్చారు.. నాగబాబు చెప్పిన ‘బద్రి’ స్టోరి

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ‘బద్రి’తో పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అసలు ఈ సినిమా అవకాశం పూరీకి ఎలా వచ్చిందో నాగబాబు చెప్పారు.

Samayam Telugu 9 Oct 2020, 11:08 pm
డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్‌పై మెగా బ్రదర్ నాగబాబు తన అభిప్రాయాలను ప్రజలతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ‘మనీ సిరీస్’ పేరుతో యూట్యూబ్ ద్వారా సంపాదన పాఠాలు చెబుతున్నారు నాగబాబు. ప్రతి ఎపిసోడ్‌లో పలు రకాల ఉదాహరణలతో డబ్బు సంపాదించడం గురించి నాగబాబు సలహాలు ఇస్తున్నారు. అయితే, శుక్రవారం అప్‌లోడ్ చేసిన ఎపిసోడ్ 9లో ‘చేయాలనుకున్న వ్యాపారంలో ప్రత్యేకమైన జ్ఞానం సంపాదించడం, సరైన శిక్షణ తీసుకోవడం’ అనే టాపిక్ గురించి మాట్లాడారు.
Samayam Telugu నాగబాబు చెప్పిన ‘బద్రి’ విశేషాలు
Nagababu


ఈ టాపిక్‌లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. పూరీని ఏకలవ్య శిష్యుడిగా నాగబాబు అభివర్ణించారు. ఎవ్వరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయని పూరీ జగన్నాథ్.. అసలు దర్శకత్వంపై ఎలా పట్టు సంపాదించారు, పెద్ద దర్శకుడిగా ఎలా ఎదిగారు వంటి విషయాలు నాగబాబు వెల్లడించారు. పూరి జగన్నాథ్ గతంలో తనకు చెప్పిన విషయాలనే నాగబాబు ప్రజలకు వివరించారు.

‘‘పూరి జగన్నాథ్ ఎవ్వరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి అవకాశం దొరకలేదు. అవకాశం రాలేదు కాబట్టి వెనక్కి వెళ్లిపోదాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. హైదరాబాద్‌లో తిరుగుతూ ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాడు. ఏదో విధంగా పర్మిషన్ సంపాదించి స్టూడియోలకు వెళ్లి షూటింగ్‌లు చూసేవాడు. సినిమా ఎలా తీస్తున్నారు.. షాట్ ఎలా పెట్టాడు.. డైలాగ్ ఏమిరాశాడు.. ఇవన్నీ గమనించేవాడు. అవన్నీ గుర్తుపెట్టుకునేవాడు. తరవాత ఆ సినిమా రిలీజైతే తాను చూసిన షాట్ తెరపై ఎలా వచ్చిందో చూసుకునేవాడు. వీటన్నిటితో పాటు వాళ్ల ఇంట్లో నాన్నగారు తయారుచేసిన లైబ్రరీ ఉంది. పుస్తకాలన్నీ చదివేవాడు. స్వతహాగా అతను మంచి రైటర్. అతను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయకపోయినా నేర్చుకున్న విషయాలన్నీ అతన్ని గొప్ప డైరెక్టర్‌ని చేశాయి’’ అని నాగాబాబు చెప్పుకొచ్చారు.

Also Read: రెండు రంగుల పొట్టి గౌనులో శ్రీముఖి.. సుధీర్‌ని కాపీ కొట్టేసిందంటూ కామెంట్స్!

ఇక పూరీ జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ అవకాశం ఎలా వచ్చింది.. పవన్ కళ్యాణ్‌ను పూరి ఎలా ఒప్పించారు వంటి విషయాలను కూడా నాగబాబు ప్రస్తావించారు. ‘‘కళ్యాణ్ బాబు కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్న సమయం అది. కళ్యాణ్ బాబుకి కథ చెప్పడానికి పూరి జగన్నాథ్ బాగా ప్రయత్నించాడు. మా కజిన్ ఒకాయన ఉంటే ఆయన్ని పట్టుకుని కళ్యాణ్ బాబుకి కథ చెప్పాలని అనుకున్నాడు. అతనికి పూరి ఆ కథ చెప్పాడు. బాగుందనిపించి మా కజిన్ కళ్యాణ్ బాబు దగ్గరికి వచ్చాడు. పూరి ఎవరి దగ్గర పనిచేశాడని కళ్యాణ్ బాబు అడిగితే.. ఎవరి దగ్గరా పనిచేయలేదు కానీ కథ చాలా బాగుందని కజిన్ చెప్పాడు.

కళ్యాణ్ బాబు ఐదారు నెలలు ఆగి అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ తను అనుకున్న కథ ఏ మాత్రం జంకు బొకు లేకుండా క్లియర్ కట్‌గా కళ్యాణ్ బాబుకి చెప్పాడు. కళ్యాణ్ బాబు చాలా ఇంప్రస్ అయ్యాడు. ఆ సినిమానే ‘బద్రి’. అప్పటికి పెద్ద నిర్మాత అయిన త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మించారు. పూరి చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఆ తరవాత పూరి జగన్నాథ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈనాటికీ పూరి జగన్నాథ్ ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు’’ అని పూరి సక్సెస్ గురించి నాగబాబు చెప్పుకొచ్చారు.

తాను సినిమా వాడిని కాబట్టి సినీ పరిశ్రమకు చెందిన ఉదాహరణలు చెబుతున్నానని.. ఇవే టెక్నిక్స్‌ని ఏ వ్యాపారానికి అన్వయించుకుని ప్రయత్నిస్తే సక్సెస్ కావడం ఖాయమని నాగబాబు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.