యాప్నగరం

శబరిమలపై సుప్రీం తీర్పును స్వాగతిస్తా.. కానీ!: రజనీకాంత్

దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న #MeToo (మీటూ) ఉద్యమంతో పాటు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రజనీకాంత్ కీలకవ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Oct 2018, 2:51 pm
పురుషులతో పాటు మహిళలు అందరికీ శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వాగతించారు. అయితే శబరిమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలని సూచించారు. కేరళలో వివాదాస్పదంగా మారిన శబరిమల అంశంపై రజనీ స్పందించారు. పెట్టా మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu Rajinikanth


‘శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల వయసున్న ఆడవారికి సుప్రీంకోర్టు ప్రవేశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నా. కానీ ఎన్నో ఏళ్లుగా ఆలయంలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని మార్చడం అనేది మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. మత పరమైన అంశాలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందర పడి వివాదాలు కొనితెచ్చుకోవద్దు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని ఎదరూ వ్యతిరేకించరు. కానీ మత సంబంధమైన అంశాల్లో మహిళలకు సమాన అవకాశాలతో ముడిపెట్టవద్దు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించడం.. మహిళలపై వివక్ష చూపడం కాదని తెలుసుకోవాలని’ అభిప్రాయపడ్డారు.

కాగా, దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న #MeToo (మీటూ) ఉద్యమం మహిళలకు మేలు చేస్తుందన్నారు. దీనిపై రాజకీయ నాయకులు స్పందించడం సరైన చర్య అన్నారు. అయితే తమ వ్యక్తిగత, ఇతరత్రా అంశాల కారణంగా మహిళలు ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించకూడదన్నారు. అలా చేస్తే బాధిత మహిళలకు న్యాయం జరగదన్నారు.

అందరు అనుకున్నట్లుగా డిసెంబర్ 12న తన రాజకీయ ప్రవేశం, తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం లేదని, కానీ అందుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తిచేశామని రజనీ తెలిపారు. సరైన సమయంలో తన రాజకీయ అజెండాతో రాజకీయాల్లోకి అడుగులు వేస్తానని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.