యాప్నగరం

ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చేయలేదు: జీవిత

తెలుగు సినీ పరిశ్రమను ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం కుదిపేస్తోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలా ఎవర్నీ వదలడంలేదు. తాజాగా ఈ వ్యవహారంలోకి జీవితా రాజశేఖర్ కూడా వచ్చారు.

Samayam Telugu 17 Apr 2018, 7:24 pm
తెలుగు సినీ పరిశ్రమను ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం కుదిపేస్తోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలా ఎవర్నీ వదలడంలేదు. తాజాగా ఈ వ్యవహారంలోకి జీవితా రాజశేఖర్ కూడా వచ్చారు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఒక కమిటీ వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనిలో జీవిత సభ్యురాలిగా ఉండబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే ఈ కమిటీపై ఇటీవల ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో నటీమణులు మాధవీలత, గాయత్రి పాల్గొనగా.. ఫోన్ లైన్ ద్వారా సంధ్య అనే సమాజిక కార్యకర్త మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె జీవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉండే అమ్మాయిలను జీవిత తన భర్త రాజశేఖర్ కోసం వాడుకున్నారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Jeevitha


అయితే దీనిపై జీవితా రాజశేఖర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘టీఆర్పీ రేటింగ్స్ పరమావధిగా తమ ఎదుగుదల కోసం ఎవరిపైన బురద చల్లడానికైనా వెనుకాడని ఘనత వహించిన దగా న్యూస్ ఛానెల్.. ఈనెల 14న చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చలో అసందర్భంగా తానొక మహిళను అని మరిచిపోయిన ఒక మహిళా నాయకురాలు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా నా మీద, నా కుటుంబం మీద వ్యక్తిగత, పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా మాట్లాడిన విషయం మీ అందరికి తెలుసు. ఆమె ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు ఏమిటి అన్ని ప్రశ్నించకుండా.. ఆమె మాట్లాడుతున్నదంతా నిజమే అని ప్రజలను నమ్మించే విధంగా న్యూస్ ప్రయోక్త ప్రవర్తించారు. వారిద్దరికీ ఇదే నా సమాధానం’ అని జీవిత హెచ్చరించారు.

‘ఛానల్ చేతిలో ఉంది కదా అని ఏమైనా మాట్లాగలం అనుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద నేను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరుకుంటున్నాను. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ మీద వేయబోయే కమిటీలో నేను ఒక సభ్యురాలిగా ఉండబోతున్నానని తెలుసుకుని దాని వల్ల వారికేదో అన్యాయం జరుగుతుందని ఊహించి కొందరు పథకం ప్రకారం ఆడుతున్న నాటకం ఇది’ అని జీవిత వివరణ ఇచ్చారు.

‘సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా గౌరవనీయమైన పదవిలో ఉన్న నేను ఇటువంటి ‘సి’ గ్రేడ్ న్యూస్ ఛానెల్ గురించి.. సంసారాలు నాశనం చేసుకుని పబ్లిసిటీ కోసం ఎవరి మీద పడితే వాళ్లమీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ రోజూ టీవీలలో కనబడే వాళ్లకు.. అదే ఛానెల్‌లో కూర్చొని నా సమాధానం చెప్పడం ఇష్టం లేక ఈ బహిరంగ ప్రకటన విడుదల చేస్తున్నాను. ఒక స్త్రీగా నేను ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చేయలేదు. వారి ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రసారం చేస్తున్న సదరు ప్రసార మాధ్యమాలను ప్రజలే బహిష్కరించాలని కోరుతున్నాను’ అని జీవిత ప్రజలకు విన్నవించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.