యాప్నగరం

Covid-19: మరో కళాకారుడిని కోల్పోయిన ఇండస్ట్రీ.. నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత

కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. ఎందరో సినీతారలు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మలయాళ పరిశ్రమకు చెందిన నటుడు కరోనా బారిన పడి కన్నుమూశారు.

Samayam Telugu 11 May 2021, 10:21 pm
రెండో దశలో కరోనా దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీ రోజు వేలాది మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈసారి కరోనా రక్కసి సామాన్యులతో పాటు ప్రముఖులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే వైరస్ సోకి.. సినీ, రాజకీయ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. ప్రతీ రోజు ఏదో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మృతి చెందుతున్నరు. తాజాగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మరో కళకారుడిని కోల్పోయింది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత మదంపు కుంజుకుట్టన్(81) కోవిడ్‌-19 బారినపడి తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu కుంజుకుట్టన్
Kunjukuttan


తొలినాళ్లలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేసిన కుంజుకుట్టన్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1978లో అశ్వద్ధామ అనే సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. 2000లో విడుదలైన ‘కరుణమ్’ అనే సినిమాకు ఆయన ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక ‘ఈ4 ఎలిఫాంట్’ అనే టీవీ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2001లో బీజేపీ తరఫున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. కుంజుకుట్టన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో ఆయన త్రిశూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్‌, స్క్రిప్ట్‌ రైటర్‌ డెన్నిస్‌ జోసెఫ్‌ మరణించిన 24గంటల్లోనే కుంజుకుట్టన్‌ కన్నుమూయడం మలయాళ సినీ పరిశ్రమని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. కుంజుకుట్టన్ మృతిపై పలువురు మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు.. పలువురు ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.