యాప్నగరం

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన చిరంజీవి.. ‘సైరా’ చూడండంటూ ఆహ్వానం

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను చూడాల్సిందిగా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్‌ను ఆయన రాజ్ భవన్‌లో కలిశారు.

Samayam Telugu 5 Oct 2019, 6:45 pm
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సోమాజీగూడలోని రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమెకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. తాను హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను వీక్షించడానికి రావాలని గవర్నర్‌ను చిరంజీవి ఆహ్వానించారు. చిరంజీవి ఆహ్వానానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
Samayam Telugu Chiranjeevi_Soundararajan
గవర్నర్‌ను సన్మానించిన చిరంజీవి


చిరంజీవి తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు శ్రీ చిరంజీవి గారు నన్ను సన్మానించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఆధారంగా తెరకెక్కించిన తన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ని చూడాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు’’ అని తన ట్వీట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.

అలాగే, ‘సైరా’ చిత్ర నిర్మాత సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సైతం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గవర్నర్‌తో చిరంజీవి సమావేశం అయిన ఫొటోలను ట్విట్‌లో పొందుపరిచింది.

ఇదిలా ఉంటే, మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.