యాప్నగరం

బాలు ఎవరినీ పైకి రానివ్వలేదా.. ‘మిథునం’ నిర్మాత చెప్పిన ఆసక్తికర విషయాలు

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా మందిని తొక్కేశారని, ఎవ్వరినీ పైకి రానివ్వలేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది ఆయన గురించి అలా మాట్లాడుకుంటారు. దీనిపై ‘మిథునం’ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 25 Sep 2020, 7:37 pm
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీ ప్రపంచానికే కాక యావత్ భారత జాతికి తీరని లోటు అని ‘మిథునం’ సినిమా నిర్మాత ఆనందరావు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘మిథునం’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇంత గొప్ప సినిమా తీసిన ఆనందరావు.. ఎస్పీ బాలుతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పారు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.
Samayam Telugu ఆనందరావు, ఎస్పీ బాలు
SP Balasubrahmanyam


‘‘నా హీరో అప్పదాసు. నా సినిమాలో రెండో పాత్రలు.. హీరో, హీరోయిన్. సినిమా మొత్తం నా ఇంట్లో తీశాను. నా సొంత ఊళ్లో రాజాం దగ్గరలో రేగిడి ఆమదాలవలస మండలంలోని వావిలవలస గ్రామంలో తీశాను. నాతో అంత అనుబంధం ఉన్న వ్యక్తి ఉప్పుడు ఈ ప్రపంచంలో లేరంటే చాలా బాధగా ఉంది. ఏడుపైతే వస్తోంది. మానసికంగా ఏడుస్తూనే ఉంటాను. నేనే కాదు నాలాంటి అభిమానులు అందరూ ఏడుస్తారు’’ అని ఆనందరావు వీడియోలో వెల్లడించారు.

Also Read: ఎస్పీ బాలు ఆఖరి పాట అదే.. ఆ ఒక్కపాట నా అదృష్టం: రఘు కుంచె

అయితే, బయట ఎవ్వరికీ తెలియని విషయాలు చెబుతానంటూ బాలు గారిపై ఉన్న ఒక ఆరోపణ గురించి ఆనందరావు మాట్లాడారు. ‘‘చాలా మంది అంటుంటారు. ఆఖరికి నా స్నేహితులు కూడా. ఆయన ఎవరినీ పైకి రానివ్వలేదు అంటారు. అది శుద్ధ తప్పు. ఆయనతో నేను కలిసి తిరిగాను. పురుషోత్తమ అని ఆయన నోటి ద్వారా బిరుదు పొందాను నేను. నా గొప్పతనం కాదు.. అది ఆయన గొప్పతనం. వ్యక్తిత్వంలో ఆయన్ని కించపరచడానికి ప్రయత్నిస్తే వాదించడానికి నేను సిద్ధం’’ అని ఛాలెంజ్ విసిరారు ఆనందరావు.

బాలు ఎవ్వరినీ ఎదగనివ్వలేదు అన్నవి కథలు అని ఆనందరావు కొట్టిపారేశారు. ‘‘ఎవరెస్ట్ శిఖరం ఏర్పడాలి అంటే రాళ్ల కూర్పు ఉండాలి. అలాంటి రాళ్లన్నీ ఎక్కి ఎక్కి ఆయన ఆ స్థానానికి చేరుకున్నారు. ఆ ఎక్కే క్రమంలో ఒక రాయి కింద పడిపోవచ్చు. దానికేముంది? ఈ విషయాన్ని ‘మిథునం’ నిర్మాతగా కాదు.. మా అప్పదాసు అభిమానిగా చెబుతున్నాను’’ అని ఆనందరావు ఎమోషనల్ అయ్యారు. చేతనైతే అంత మహోన్నత వ్యక్తి మన మధ్య లేనందుకు ఆయన పాట వినైనా బాధపడాలని ఆనందరావు హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.