యాప్నగరం

Pawan Kalyan: జనసేనలోకి వెళ్తే బాబు గారితో ఉండొచ్చు.. అందుకే ఆ బస్సే ఎక్కుతా: కమెడియన్ పృథ్వీ కీలక వ్యాఖ్యలు

30 Years Industry Prudhvi: కమెడియన్ పృథ్వీ కొత్త రాగం అందుకున్నారు. వైసీపీ పార్టీ జెండాను భుజాలపై మోసి.. SVBC చైర్మన్ పదవిని అందుకున్న పృథ్వీ.. ఎంత త్వరగా అయితే ఆ పార్టీలో ఎదిగారో.. అంతే త్వరగా కిందకి పడ్డారు.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Jun 2022, 7:47 pm
ఓడ దాటే దాక ఓడమల్లయ్య.. ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య అన్నాడట వెనకటికొకడు.. కమెడియన్ పృథ్వీ తీరు ఇప్పుడు అలాగే ఉంది. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రత్యర్థి పార్టీల గురించి నోటికొచ్చినట్టు పేలి.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, చంద్రబాబు, లోకేష్‌ల గురించి దారుణంగా మాట్లాడారు. ఆ మాటల దాడితో పాపులర్ అయ్యి.. పృథ్వీ స్థాయికి మించి ఆయన్ని SVBC (శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్‌ని చేశారు. అయితే ఓ మహిళా ఉద్యోగితో వెనకనుంచి పట్టుకుంటా అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్న ఫోన్ కాల్ బయటకు రావడంతో.. ఆ ఫోన్ కాల్ పృథ్వీ SVBC చైర్మన్ పదవికి ఎసరు పెట్టింది. ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు.. పార్టీ నుంచి పక్కనపెట్టారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పృథ్వీ.. ఒకప్పుడు ఎవర్నైతే దారుణంగా తిట్టారో వాళ్ల దగ్గరకే చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Samayam Telugu comedian prudhvi
comedian prudhvi janasena


దానిలో భాగంగా.. తాను కాపునని కొత్త రాగం అందుకుంటూ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే మా నాయకుడ్ని ఒకప్పుడు దారుణంగా తిట్టి.. ఇప్పుడు అదే పార్టీలోకి వస్తానని అనడానికి సిగ్గులేదా? అంటూ జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయితే పృథ్వీ మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా.. వైసీపీ పార్టీని తిట్టడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఏ పార్టీ జెండా అయితే భుజాన మోసారో.. అదే పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఏబీఎన్ ఛానల్ ‘ఓపెన్ హార్ట్ విత్’ ఆర్కేలో కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లిన పృథ్వీ జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు 2024లో మంచి బస్సు ఎక్కి ఆ బస్‌కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని.. జనసేన బస్సు ఎక్కితే చంద్రబాబుగారితో ఉండొచ్చని అన్నారు పృథ్వీ.

అంతా బాగానే ఉంది కానీ.. జనసేన పార్టీలో చేరితే.. అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉండొచ్చు.. కానీ పృథ్వీ మాత్రం చంద్రబాబు గారితో ఉండొచ్చని అంటుండటాన్ని బట్టి చూస్తే ఇతని లెక్కలు మళ్లీ వెనకనుంచి పట్టుకునే యవ్వారం మాదిరిగానే ఉందని సెటైర్లు పడుతున్నాయి.

ఇదిలాఉంటే.. జనసేన పార్టీలో చేరకముందే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై కూడా జోస్యం చెప్పేశారు. మరో ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో నలభై సీట్లు కొట్టబోతోన్నాం.. నేను రాసిస్తాను.. ఘంటాపథంగా చెబుతున్నా.. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్.. జనం కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్.. ఇలాంటి నాయకుడితోనే మార్పు సాధ్యం’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు పృథ్వీ.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.