యాప్నగరం

ప్రముఖ సినీ గేయ రచయిత శివ గణేష్ కన్నుమూత

ఎన్నో సూపర్ హిట్ అనువాద చిత్రాలకు గేయ రచయితగా పనిచేసిన ప్రముఖ లిరిసిస్ట్ శివ గణేష్ మృతి చెందారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 15 Aug 2019, 6:30 pm
ప్రముఖ సినీ గేయ రచయిత శివ గణేష్ కన్నుమూశారు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గేయ రచయితగా పనిచేసిన శివ గణేష్ బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న నివాసంలో ఆయన మృతి చెందారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘ప్రేమికులరోజు’, ‘నర్సింహ’, ‘జీన్స్‌’, ‘బాయ్స్‌’, ‘ఒకే ఒక్కడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు లిరిసిస్ట్‌గా పనిచేయడం ద్వారా శివ గణేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అజిత్ ‘ఎంతవాడు గానీ’ చిత్రానికి కూడా ఆయన తెలుగులో సాహిత్యం అందించారు.
Samayam Telugu Siva-ganesh


వెయ్యికి పైగా చిత్రాలకు శివ గణేష్ గేయ రచయితగా పనిచేశారు. కేవలం గేయ రచయితగానే కాకుండా మాటల రచయితగా కూడా శివ గణేష్ సేవలందించారు. అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒకే ఒక్కడు’కి తెలుగులో డైలాగులు శివ గణేష్ రాశారు. అనువాద చిత్రాలకే శివ గణేష్ ఎక్కువగా పనిచేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. శివ గణేష్ మృతికి పలువురు తెలుగు, తమిళ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.