యాప్నగరం

బాలకృష్ణ మాటలను లైట్ తీసుకోండి.. ఎవ్వడికీ నష్టం కాదు: పోసాని వ్యాఖ్యలు

సినీ పెద్దల చర్చలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. బాలకృష్ణ కోపం ఒక్క నిమిషమేనని.. దాన్ని లైట్ తీసుకోవాలని సూచించారు.

Samayam Telugu 7 Jun 2020, 9:03 pm
లాక్‌డౌన్ కారణంగా మూతబడిన సినిమా ఇండస్ట్రీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి సినీ పెద్దలు కొంత మంది తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సి.కళ్యాణ్.. ఇలా కొంత మంది సినిమా పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. అయితే, ఈ భేటీలకు తనను పిలవకపోవడంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలుసు.
Samayam Telugu పోసాని, బాలకృష్ణ
Posani Krishna Murali


తనను ఈ చర్చలకు ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య.. మీటింగ్ పెట్టుకుని భూములు పంచుకుంటున్నారా అంటూ మీడియా ముందు నోరు జారారు. దీనిపై కొద్ది రోజులుగా తీవ్ర దుమారమే రేగుతోంది. బాలయ్యపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అవ్వడం, క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇండస్ట్రీలో కొంత మంది పెద్దలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి నచ్చినవారికి వారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలపై తాజాగా నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి స్పందించారు.

Also Read: జగన్ నా వీరాభిమాని.. కడప టౌన్ ప్రెసిడెంట్: బాలకృష్ణ

ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోసాని.. ‘‘బాలకృష్ణ తిట్టినా ఒక నిమిషమే. ఆవేశ పడినా ఒక నిమిషమే. కోపం పడినా ఒక నిమిషమే. విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి, బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్‌గా తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆయన కేవలం పదవి కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు. నిజాయతీగా ఉంటారు. లంచగొండి కాదు.

వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరూ ఆయన చుట్టుపక్కలకు రాలేదు. రామారావును అడ్వాంటేజ్‌గా తీసుకొని కొడుకులు సంపాదించలేదు. అప్పట్లో ఏ పేపర్‌లో రాలేదు. ఏ కాంగ్రెస్ వాళ్లు కూడా అనలేదు. ఎప్పుడూ అవినీతి అనే మాట లేని మనిషి బాలయ్య. ఆయనకి ఉన్నదల్లా నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు. ఎవ్వడికీ నష్టం కాదు. అంతా చాలా లైట్‌గా తీసుకుంటారు. నేనూ తీసుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.