యాప్నగరం

నీచ, నికృష్టపు వర్మా.. ఆ 5 కోట్లు ఎవరిచ్చారు?: అల్లు అరవింద్

తల్లి లాంటి తెలుగు పరిశ్రమకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ద్రోహం చేస్తున్నాడని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ధ్వజమెత్తారు. రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని మండిపడ్డారు. ఫిలిం చాంబర్‌లో గురువారం (ఏప్రిల్ 19) ఆయన మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 19 Apr 2018, 5:40 pm
తల్లి లాంటి తెలుగు పరిశ్రమకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ద్రోహం చేస్తున్నాడని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ధ్వజమెత్తారు. రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని మండిపడ్డారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన అన్నారు. ఫిలిం చాంబర్‌లో గురువారం (ఏప్రిల్ 19) ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో సీనియర్‌గా, మెగా ఫ్యామిలీకి పెద్దగా తాను ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్‌మీట్ పెట్టక తప్పలేదని ఆయన తెలిపారు.
Samayam Telugu allu


‘తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తల్లి లాంటి తెలుగు పరిశ్రమకు రామ్‌గోపాల్‌ వర్మ ద్రోహం చేస్తున్నాడు. ఇండస్ట్రీ తలదించుకునేలా ఇలాంటి ఘటనలు ఏమిటా? అని అందరూ బాధపడుతున్నారు. పవన్‌ కళ్యా‌ణ్‌ను దూషించాలని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు వర్మ చెప్పాడు. పవన్‌‌ను టార్గెట్‌ చేయమని తాను చెప్పినట్టు శ్రీరెడ్డి వీడియో వస్తుందని ముందే ఊహించి, అంతకుముందే వీడియో పెట్టాడు. రామ్‌గోపాల్‌ వర్మ అండ్‌ కో ఒక నీచపు వర్గం’ అని అల్లు అరవింద్ విమర్శించారు.

‘వర్మ హడావుడిగా వెధవ నాటకం ఆడాడు. తాను విడుదల చేసిన వీడియోలో సురేష్‌ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి రూ.5 కోట్లు ఇప్పిద్దామని ప్రయత్నించాను.. ఒప్పుకోలేదు అని చెప్పాడు. ఈ విషయంపై నేను సురేష్‌ బాబుకు ఫోన్‌ చేస్తే చట్టంపై మాకు గౌరవం ఉంది అన్నారు. పవన్‌ కళ్యా‌ణ్‌ను తిట్టిస్తే నీకు రూ. 5 కోట్లు ఇస్తామన్నది ఎవరు? నీ నీచపు బుద్ధి నాకు తెలుసు. నీ వెనుక ఎవరున్నారో తెలుసు. నీ ఆటలు ఎంతమాత్రం సాగనివ్వం. ఇవన్నీ చూస్తుంటే రాత్రి నాకు నిద్ర పట్టలేదు’ అని అరవింద్ అన్నారు.

శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందని అల్లు అరవింద్ తెలిపారు. ‘ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది. రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కమిటీలో 50 శాతం ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు మహిళలు, ఎన్‌జీవోలు ఉంటారు. తప్పు చేసిన నిర్మాత, దర్శకులు ఎవరైనా ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.