యాప్నగరం

Raghava Lawrence: ప్రజల దగ్గరకు వెళ్లి సేవ చేస్తా.. కేరళకు లారెన్స్ భారీ విరాళం

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లారెన్స్.. ఇప్పటికే ‘ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించి చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.

Samayam Telugu 23 Aug 2018, 8:28 pm
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లారెన్స్.. ఇప్పటికే ‘ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించి చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. అనాథ పిల్లలను చేరదీస్తున్నారు. ఇప్పుడు కేరళకు అండగా నిలిచారు. భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. 4 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు.
Samayam Telugu Raghava_Lawrence


ఇలాంటి కష్టకాలంలో కేరళ ప్రజలను ఆదుకోవడానికి భారీ విరాళాన్ని లారెన్స్ ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు లారెన్స్ తెలిపారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్..! కేరళకు రూ.1 కోటి విరాళంగా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. వరదల కారణంగా మన సోదరులు, సోదరీమణుల్లాంటి కేరళ ప్రజలు నరకం చూస్తున్నారు. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. నేరుగా కేరళకు వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సేవచేయాలని అనుకున్నాను. కానీ ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కష్టమని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఆగాలన్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గాయి. కేరళ ప్రభుత్వం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వరదల కారణంగా ఏ ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయో ప్రభుత్వానికే బాగా తెలుస్తుంది. ఈ శనివారం కేరళ సీఎం అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. నా విరాళాన్ని నేరుగా సీఎంకు ఇవ్వాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా వెళ్లి సేవ చేయడానికి నాకు సహకరించాలని సీఎంను రిక్వెస్ట్ చేస్తాను. కేరళను ఆదుకునేందుకు సహాయ పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. వీలైనంత త్వరగా కేరళ కోలుకోవాలని ఆ రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తాను’ అని లారెన్స్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.