యాప్నగరం

NTR పెట్టిన భిక్షతో ప్రత్యేకమైన నటుడిగా నిలిచా.. బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని: రాజేంద్ర ప్రసాద్

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా సీనియర్ రాజేంద్ర ప్రసాద్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతోనే తాను ప్రత్యేక నటుడిగా నిలిచానని అన్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 28 May 2022, 4:31 pm
విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) జయంతి సందర్భంగా సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ (NTR)తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చానని.. ఆ మహానుభావుడు బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని అన్నారు.
Samayam Telugu రాజేంద్ర ప్రసాద్


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం ఆయనను తలుచుకుంటోందన్నారు. 'ఆయన ద్వారా నేను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఆయన ఆశయానికి తగినట్లుగా.. ఆయన చూపిన మార్గంలో నడిచి మీ అందరి ముందు ఈ రోజు ఒక ప్రత్యేకమైన నటుడిగా నిలిచాను. నాకు ఆ భిక్ష ప్రసాదించారు నా దేవుడు నందమూరి తారక రామారావు..' అని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి రావాలని ఎంతో మంది తనను ఆహ్వానించారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. అన్ని చోట్లకు తాను వెళ్లలేను కదా అని.. ఓ పది మందికి సాయం చేయాలని కోరారనని అన్నారు. ఇదే పెద్దాయనకు ఇచ్చే ఘన నివాళి అని చెప్పానని పేర్కొన్నారు. తనకు తెలిసి ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెద్దాయన పేరు మీద అన్నదానాలు జరుగుతున్నాయన్నారు. కొన్నేళ్లు ఎన్టీఆర్ పక్కన ఉన్నానని.. ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని అనేవారని గుర్తుచేసుకున్నారు.

'ఈరోజున మా పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో ఆయన పాద పూజ చేసి ఉండేవాడిని. అది నా ఉద్దేశం. ఆయన ఎక్కడ ఉన్నా వందశాతం ఆయన దీవెనలు మనకు ఉంటాయి. ఆయనది మహానుభావుడి జన్మ. అలాంటి జన్మను మన తెలుగువాళ్లం ఎప్పుడు చూస్తామో తెలియదు. జై ఎన్టీఆర్..' అంటూ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగాన్ని ముగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.