యాప్నగరం

విజయ్ ఆంటొని కోసం మళ్లీ ఒక్కటైన ఎస్‌పీబీ, ఇళయరాజా

ఎస్పీబీ, ఇళయరాజా మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఇప్పుడు తొలగిపోయాయి. మళ్లీ ఈ దిగ్గజాలు ఒక్కటయ్యారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 2న) చెన్నైలో ఇళయరాజా స్వయంగా నిర్వహించే లైవ్ షోలో ఎస్పీబీ పాల్గొంటున్నారు.

Samayam Telugu 2 Jun 2019, 3:31 pm
మ్యాస్ట్రో ఇళయరాజా, గానగాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్ గురించి సంగీత ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో కొన్ని వేల పాటలు రాగా.. వాటిలో ఆణిముత్యాలు వందల్లో ఉన్నాయి. ఇళయరాజా మంచి ఫామ్‌లో ఉన్న 1980ల సమయంలో ఆయన ఆస్థాన గాయకుడిగా ఎస్పీబీ ఉండేవారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే, రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్య కాస్త మనస్పర్థలు వచ్చాయి.
Samayam Telugu SPB


ఎస్పీబీ విదేశాల్లో నిర్వహించే లైవ్ షోలలో తన పాటలు పాడుతున్నారని, దీనికి తన అనుమతి తీసుకోవడంలేదని, దీన్ని ఇక్కడితో ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రెండేళ్ల క్రితం ఎస్పీబీకి ఇళయరాజా నోటీసులు పంపారు. ఈ విషయంలో ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ఎస్పీబీ అప్పటి నుంచి ఆయన పాటలను బయట ఎక్కడా పాడటం లేదు. ఈ సంఘటన తరవాత ఇళయరాజా, ఎస్పీబీ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. దీంతో వీరి అభిమానుల్లో కాస్త అసంతృప్తి ఉండేది. మళ్లీ వీరిద్దరి కలయికలో పాట వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఇప్పుడు తొలగిపోయాయి. మళ్లీ ఈ దిగ్గజాలు ఒక్కటయ్యారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 2న) చెన్నైలో ఇళయరాజా స్వయంగా నిర్వహించే లైవ్ షోలో ఎస్పీబీ పాల్గొంటున్నారు. ఎస్పీబీతో పాటు జె.ఏసుదాసు ఈ షోలో పాటలు పాడనున్నారు. అంతేకాదు, చాలా కాలం తరవాత ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పీబీ ఒక పాటను ఆలపించారు. విజయ్ ఆంటొని హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం ‘తమిళరసన్’కు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాటను ఎస్పీబీ ఆలపించారు. ఇప్పటికే రికార్డింగ్ కూడా పూర్తయింది.

కాగా, ‘తమిళరసన్’ సినిమాలో విజయ్ ఆంటొని పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్య నంబీసన్, సురేష్ గోపి, సంగీత, ఛాయా సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనూ సూద్ విలన్‌గా నటిస్తున్నారు. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం తెలుగులోకి అనువాదమై విడుదలయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.