యాప్నగరం

ప్రపంచానికి ఆమె చాందిని.. నాకు స్నేహితురాలు: బోనీ

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య మళ్లీ తన లోకానికి వెళ్లిపోయిందంటూ అభిమానులు బాధాతప్త హృద‌యంతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.

TNN 1 Mar 2018, 1:58 pm
అతిలోక సుందరి హఠాన్మరణం యావత్తు సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య మళ్లీ తన లోకానికి వెళ్లిపోయిందంటూ అభిమానులు బాధాతప్త హృద‌యంతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. అశేష అభిమానుల అశ్రునయనాల మధ్య ఇంద్రపురి రాకుమారి అంత్యక్రియులు ముగిసిన తర్వాత ఆమె భర్త బోనీ కపూర్ ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ విడుదల చేసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. ఓ స్నేహితురాలిని, భార్యను, తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లల బాధను వర్ణించలేకపోతున్నానని ఆవేదన చెందారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాని అన్నారు.
Samayam Telugu sridevi was the worlds chandni to me my love boney kapoor
ప్రపంచానికి ఆమె చాందిని.. నాకు స్నేహితురాలు: బోనీ


కుటుంబం, స్నేహితులు, కుమారుడు అర్జున్, కుమార్తెలు అన్షులా, జాన్వి, ఖుషీలతోపాటు కోట్లాదిమంది అభిమానులు తనకు మద్దతుగా నిలిచి, ధైర్యానిచ్చారని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఓ కుటుంబంగా తమ బాధను భరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రపంచానికి ఆమె చాందిని.. తన అభిమానులకు అద్భుత నటి... కానీ తనకు మాత్రం ప్రేమమూర్తి, స్నేహితురాలు, భాగస్వామి, ఇద్దరు పిల్లలకు తల్లి అని ఆ లేఖలో పేర్కొన్నారు. తన పిల్లలకైతే ఆమే సర్వస్వమని పేర్కొన్నారు. ఆమె జ్ఞాపకాలు చెరిగిపోయేవి కావని, వెండి తెర ఉన్నంత వరకు అవి పదిలంగా ఉంటాయన్నారు.

pic.twitter.com/VNgw7FY9rF — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) February 28, 2018
ప్రస్తుతం తన ముందున్న సమస్య శ్రీదేవి లేకుండా ఇద్దరు పిల్లలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్నదేనని.. అదే తనను ఆందోళనకు గురిచేస్తోందని బోనీ వాపోయారు. పిల్లలకు అన్నీ తానై ముందుకు సాగింది.. ఆమే మా జీవితం, మా బలం.. భరించలేని ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఒక కుటుంబంగా మేము కలిసి ప్రయత్నించాం.. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు బోనీ తెలిపారు. శ్రీదేవి మరణంతో తాము ఎంతో వేదన అనుభవిస్తున్నామని, తమను మనసారా దు:ఖాన్ని అనుభవించేందుకు తగిన అవకాశం కల్పించాలని ఆమె కుటుంబసభ్యులు మీడియాకు విఙ్ఞ‌ప్తి చేశారు. మేము ఏకాంతంగా దు:ఖించాల్సిన మా అవసరాన్ని గౌరవించండంటూ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.