యాప్నగరం

Srikanth: ‘మా’లో అవకతవకలు.. అసోసియేషన్ గడపతొక్కనన్న శ్రీకాంత్

అసలు ఈ ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధంలేదని, ఇలాంటి లెక్కలన్నీ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీలే చూసుకుంటారని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Samayam Telugu 4 Sep 2018, 10:25 am
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి అమెరికాలో ప్రదర్శన హక్కులు విషయంలో అవకతవకలు జరిగాయని పరిశ్రమలో ఓ వర్గం ఆరోపిస్తోంది. ప్రధానంగా అధ్యక్షుడు శివాజీరాజాతో పాటు, అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హీరో శ్రీకాంత్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Samayam Telugu Srikanth


‘మా’కి సొంత భవనం కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా ‘మా’కి కోటి రూపాయల నిధులు సమకూరింది. అయితే ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ప్రధాన ఆరోపణ. ఈ కోటి రూపాయలు కాకుండా అదనంగా కొంత డబ్బు అసోసియేషన్‌కు చెందిన బినామీ అకౌంట్‌లోకి చేరినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేయడానికి కూడా అసోసియేషన్ పెద్దలు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని సెక్రటరీ సీనియర్ నరేష్ స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Read Also: మరో వివాదంలో ‘మా’.. ఆస్తినంతా రాసిస్తాం!

ఈ ఆరోపణలపై ‘మా’ స్పందించింది. అధ్యక్షుడు శివాజీరాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తదితరులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్‌కు సెక్రటరీ నరేష్ హాజరుకాలేదు. నిధుల సమీకరణలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ‘మా’ సభ్యులు కొట్టిపారేశారు. ముఖ్యంగా హీరో శ్రీకాంత్ కాస్త ఘాటుగానే స్పందించారు. తనపై వస్తోన్న ఆరోపణలను నిరూపిస్తే అసోసియేషన్ గడప కూడా తొక్కనని, నిరూపించకపోతే ఆరోపణలు చేస్తున్నవారు ‘మా’ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
అసలు ఈ ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధంలేదని, ఇలాంటి లెక్కలన్నీ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీలే చూసుకుంటారని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై నరేష్‌తో 45 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడనని, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాల్సిన అవసరం తనకుందని చెప్పానని వెల్లడించారు. దీని కోసం సోమవారం ప్రెస్ మీట్ పెడుతున్నామని, దీనికి మీరు రావాలని కూడా నరేష్‌కు చెప్పినట్లు శ్రీకాంత్ తెలిపారు. ‘ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకమ్మా.. నిన్న అంతా మాట్లాడం కదా’ అని నరేష్ బదులిచ్చినట్లు కూడా శ్రీకాంత్ వెల్లడించారు. వివరణ ఇచ్చిన తరవాత కూడా తనపై ఆరోపణలు ఎందుకొస్తున్నాయని నరేష్‌ను ప్రశ్నించానని, అగ్రిమెంట్‌ మీద సంతకం చేసింది మీరే కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని నరేష్‌తో అన్నట్లు శ్రీకాంత్ తెలిపారు.

Read Also:

‘అగ్రిమెంట్ మీద ఉన్న డబ్బు అసోసియేషన్‌కు వచ్చిందా లేదా అనేదే లెక్క. వాళ్లంత ఎంత లాభం పొందారు, ఎన్ని సీట్లు ఫిల్ చేశారు అనేవి మాకు అనవసరం. మన డబ్బు మనకి కచ్చితంగా వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. అగ్రిమెంట్ ప్రకారం ఐదు పైసలు తక్కువగా అసోసియేషన్‌కు వచ్చిందని నిరూపిస్తే నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గడప కూడా తొక్కను. సభ్యత్వం కూడా నేను రద్దు చేసుకుంటాను. దీన్ని నిరూపించకపోతే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్లు నేను చేసే పనే చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా’ అని శ్రీకాంత్ గట్టిగానే చెప్పారు. ఈ ఛాలెంజ్ పరోక్షంగా నరేష్‌కు విసిరినట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.