యాప్నగరం

హైదరాబాద్‌‌లో సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్

దేశంలో కాస్మోపాలిటన్ కల్చర్ వున్న వివిధ నగరాల్లో ప్రతీ సంవత్సరం నిర్వహించే సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్...

TNN & Agencies 14 Jan 2017, 6:08 pm
దేశంలో కాస్మోపాలిటన్ కల్చర్ వున్న వివిధ నగరాల్లో ప్రతీ సంవత్సరం నిర్వహించే సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈసారి కూడా యధావిధిగా యువతని ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. అయితే, బెంగుళూరు, ముంబై నగరాల్లో నిర్వహించాల్సి వున్న ఈ ఫెస్టివల్ తేదీలు, వేదికలు ఖరారయ్యాక అనుకోకుండా రద్దయ్యాయి. మొదట బెంగుళూరులో జరగాల్సి వున్న ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు. సన్‌బర్న్ నిర్వాహకులు తమ వద్ద అనుమతి తీసుకోలేదనే కారణంతో అక్కడి పోలీసులు ఈ ఈవెంట్‌ని ముందుగానే అడ్డుకున్నారు.
Samayam Telugu sunburn 2017 music festival latest details
హైదరాబాద్‌‌లో సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్


అనుమతి లేకుండా నిర్వహించే కార్యక్రమాలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది అనే కారణంతోనే బెంగుళూరు పోలీసులు సన్‌బర్న్‌కి నో చెప్పారని తెలుస్తోంది. ఇటీవలే జనవరి ఫస్ట్ వేడుకల సందర్భంగా బెంగుళూరులో కొంతమంది ఆకతాయిలు చేసిన దుశ్చర్యలు తమ నగరాన్ని అప్రతిష్టపాలు చేశాయని భావిస్తున్న బెంగుళూరు పోలీసులు ఈ ఈవెంట్‌ని ముందస్తుగానే అడ్డుకున్నట్టుగాను వార్తలొస్తున్నాయి. మరోవైపు ముంబైలో జరగాల్సి వున్న ఈవెంట్ కూడా ఇటువంటి కారణాలతోనే రద్దయింది.

ముంబైలో ఈవెంట్ రద్దు అయినప్పటికీ, తిరిగి అదే టికెట్లతో అదే వేదికపై ఆదివారం సన్‌బర్న్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. జనవరి 15, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముంబైలోని జియో గార్డెన్స్‌లో ఈ వేడుక జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఇక ఇవాళ, అంటే జనవరి 14న హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్న ఈవెంట్‌తోపాటు, రేపు ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈవెంట్లలో ఎటువంటి మార్పులు లేవు అని సన్‌బర్న్ సీఈఓ కరణ్ సింగ్ తెలిపారు.

సన్‌బర్న్ ఈవెంట్లలో తన లైవ్ పర్‌ఫార్మెన్స్‌లతో యువతని హుషారెత్తించనున్న డెవిడ్ గెట్టా హైదరాబాద్‌కి వస్తున్న సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఆయనకి తమ ట్విటర్ హ్యాండిల్ ద్వారా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం నిర్వహణలో నిర్వాహకులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకారం అందించేందుకు సైబరాబాద్ పోలీసులు సదా సిద్ధంగా ఉంటారని పోలీసులు ఆ ట్వీట్‌లో పేర్కొనడం విశేషం.
Welcome to #Hyderabad @davidguetta. Look forward to hosting you tomorrow. @cyberabadpolice committed to ensure a glitch free event as always — Cyberabad Police (@cyberabadpolice) January 13, 2017
గతేడాది గోవాలో జరిగిన సన్‌బర్న్ ఫెస్టివల్లో మన టాలీవుడ్ సినీప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి చిరు, రాంచరణ్, వరుణ్ తేజ్‌లతోపాటు ఇతర ప్రముఖులైన రానా దగ్గుబాటి, రవితేజ, దిల్ రాజు వంటివాళ్లు ఈ ఫెస్టివల్లో పాల్గొని సందడి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.