యాప్నగరం

మొట్టమొదటి 70ఎం.ఎం. చిత్రానికి 30 ఏళ్ళు!

తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌ చిత్రం 'గూఢచారి 116'. తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు'. తొలి తెలుగు సినిమా స్కోప్‌

Samayam Telugu 24 Mar 2016, 3:28 pm
తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌ చిత్రం 'గూఢచారి 116'. తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు'. తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'ని అందించిన సూపర్‌స్టార్‌ కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌తో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'సింహాసనం' మార్చి 21న 1986లో విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్‌ చేసి ఆల్‌టైమ్‌ స్టేట్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. అత్యంత భారీ సెట్స్‌ వేసి హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోలో, హోగినికల్‌లో, మైసూర్‌లో ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మించారు. జానపద చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన 'సింహాసనం' ఓపెనింగ్స్‌ పరంగా ఆ రోజుల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. వైజాగ్‌ చిత్రాలయలో 100 రోజులు హౌస్‌ఫుల్స్‌తో ప్రదర్శింపబడింది. విజయవాడ రాజ్‌లో కంటిన్యూస్‌గా 53 రోజులు ఫుల్స్‌ అయింది. అలాగే డైరెక్ట్‌గా 16 కేంద్రాల్లో 50 రోజులు, 6 సెంటర్స్‌లో 100 రోజులకుపైగా ప్రదర్శింపబడిందీ సినిమా. హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో రోజూ 4 ఆటలతో 105 రోజులు ఆడింది.
Samayam Telugu super star krishnas simhasanam movie completed 30 years
మొట్టమొదటి 70ఎం.ఎం. చిత్రానికి 30 ఏళ్ళు!


చెన్నైలో 'సింహాసనం' శతదినోత్సవం విజిపి గార్డెన్స్‌లో జరిగినప్పుడు కృష్ణ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్య పరిచింది. దాదాపు 400 బస్సుల్లో ఘట్టమనేని అభిమానులు చెన్నై రావడం పెద్ద చర్చనీయాంశం అయింది. జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావుల నిర్వహణలో పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌పై కృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తూ నిర్మించిన 'సింహాసనం' ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడం విశేషం. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన 'సింహాసనం' సాంగ్స్‌ అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పటికీ 'ఆకాశంలో ఒకతార నా కోస మొచ్చింది ఈవేళ', 'వాహ్వా నీ యవ్వనం', 'గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ' పాటలు వినిపిస్తూనే వుంటాయి. రచయిత మహారథి ఈ చిత్రానికి మాటలు రాయడమే కాకుండా ఓ పాత్ర పోషించారు. తెలుగులో హిందీ నటుడు అంజాద్‌ ఖాన్‌ నటించిన తొలి చిత్రం ఇదే. కృష్ణ సరసన జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్స్‌గా నటించగా వహీదా రెహమాన్‌, గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, గిరిబాబు, సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో 'సింహాసనం', హిందీలో 'సింఘాసన్‌' పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం 60 రోజుల్లోనే రూపొందించబడింది. వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఛాయా గ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి.మాధవరావు మేకప్‌, శీను నృత్య దర్శకత్వం, వీరు దేవగన్‌ ఫైట్స్‌ 'సింహాసనం' చిత్రాన్ని టెక్నికల్‌గా ఓ రేంజ్‌కి తీసుకెళ్ళాయి. విక్రమసింహగా, ఆదిత్య వర్దనుడుగా సూపర్‌స్టార్‌ ద్విపాత్రాభినయం అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్‌ దగ్గర ఓపెనింగ్‌కి వచ్చిన భారీ క్రౌడ్స్‌కి ట్రాఫిక్‌ జామ్‌ అయి ట్రాఫిక్‌ని వేరే రోడ్లవైపు డైవర్ట్‌ చెయ్యాల్సి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా అఖండ ప్రజాదరణ పొందిన 'సింహాసనం' విడుదలై నేటికి 30 ఏళ్ళు పూర్తయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.