యాప్నగరం

మనసున్న మారాజు మహేష్.. వెయ్యి మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు

‘‘ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో కావాల్సిన అవసరంలేదు. మనసులో బలంగా సంకల్పించుకుంటే ఎవరైనా సేవ చేయొచ్చని మహేష్ నిరూపించారు’’.. ఇదీ ప్రస్తుతం ఆయన అభిమానులు చెబుతోన్న మాట.

Samayam Telugu 7 Sep 2019, 4:04 pm
సినిమాల్లోనే కాదు ఎదుటి మనిషికి సాయం చేయడంలోనూ మహేష్ బాబు సూపర్ స్టారే. సినిమాల ద్వారా తాను సంపాదిస్తోన్న దానిలో కొంత మొత్తం సామాజిక సేవకు కేటాయిస్తున్నారు మహేష్ బాబు. ఈ విషయంలో ఆయనకు భార్య నమ్రతా ఎంతో సహాయపడుతున్నారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే మహేష్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన తరఫున నమ్రత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అనాథ పిల్లలకు సాయం అందిస్తున్నారు. వారికి వినోదాన్ని పంచడానికి ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేక షోలు వేయిస్తున్నారు.
Samayam Telugu Mahesh-Babu


మరోవైపు, మహేష్ బాబు తన సొంతూరు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. తన ఊరి ప్రజలతో మా బాబు బంగారం అనిపించుకున్నారు. ఇదొక్కటేనా తెలంగాణలోని సిద్ధాపురంను కూడా మహేష్ దత్తత తీసుకున్నారు. 2016 నుంచి ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంతేనా, తన అభిమానులు ఆపదలో ఉంటే ఆదుకుంటున్నారు. చివరి కోరికలు తీరుస్తున్నారు. అయితే, మహేష్ బాబు వేసిన మరో ముందడుగుపై తాజాగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: ‘సాహో’ దర్శకుడికి డెంగ్యూ.. అందుకే, వారం రోజులు కనపడలేదా?

హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు మహేష్ బాబు గతంలో ముందుకొచ్చారు. దీని కోసం యూకేకు చెందిన హెడ్‌లైన్ లిటిల్ హార్ట్స్ (HLH), విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్‌తో మహేష్ చేతులు కలిపారు. మొత్తం 1000 మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు. ఈ శస్త్ర చికిత్సలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పెషలిస్టు డాక్టర్లను వాలంటరీ విధానంలో తీసుకొచ్చారు. మూడున్నరేళ్లలో మొత్తం వెయ్యి మంది పిల్లలకు ఆపరేషన్లు చేశారు.

ఈ ఆపరేషన్లకు అయిన ఖర్చు మొత్తాన్ని మహేష్ బాబు భరించారు. ఆపరేషన్ తరవాత పిల్లల భద్రతకు అవసరమయ్యే ఏర్పాట్లు కూడా చూసుకున్నారు. అయితే, వెయ్యి మంది పిల్లలకు మహేష్ విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయించడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనసున్న మారాజు మా మహేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.