యాప్నగరం

కన్ను గీటడంలో తప్పేం లేదు.. ప్రియా ప్రకాష్‌కు భారీ ఊరట

ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటడం ఏ మత ఆచారాలను కించపరడం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయడం పట్ల స్పందిస్తూ.. మీకు మరేం పని లేదా అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

Samayam Telugu 1 Sep 2018, 11:33 am
కన్నుగీటి రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో నటితోపాటు మూవీ దర్శకుడు, నిర్మాతలకు ఊరట లభించింది. కన్ను గీటడం ఇస్లాం సహా ఏ ఇతర మతాలను కించ పరచడం కిందకు రాదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్వికర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పాట చిత్రీకరణలో భాగంగా చేసిన చిన్న చర్యను సాకుగా చూపి కేసులు నమోదు చేయడం సరికాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వినోదాన్ని పంచడంలో భాగంగా పాట ఉందని, కన్ను గీటడం ఏ మతాన్ని కించ పరచడం కాదని పునరుద్ఘాటించారు.
Samayam Telugu priya varrier


ఒమర్‌ లులు దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘ఒరు అదార్ లవ్’లోని ఓ పాట తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని నటి ప్రియా ప్రకాష్, దర్శక, నిర్మాతలపై దక్షిణాది రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొందరు ముస్లింలు మూవీలోని ఆ పాటను తొలగించాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కన్నుగీటిన ప్రియాతో సహా దర్శక నిర్మాతలతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రియా వారియర్, దర్శకుడు, నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘మాణిక్య మలరయ పూవి’ పాటలో ప్రియా వారియర్ కన్నుకొట్టడంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు.

సినిమాలోని మాణిక్య మలరయ పూవి పాట 1978 నుంచి ప్రజలకు, ముఖ్యంగా ముస్లింల ఆదరణ పొందిన ఒక జానపద పాట అని వాదనలో భాగంగా ప్రియా తరఫు న్యాయవాది తెలిపారు. పాటపై తమకెలాంటి అభ్యంతరం లేదన్న పిటిషనర్లు పాట చిత్రీకరణ తీరే తమకు అభ్యంతరకరంగా ఉందన్నారు. కానీ ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పాటలు చిత్రీకరిస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తూ విలువైన సమయాన్ని వృథా చేయడం తగదని హెచ్చరించింది.

మరోవైపు వివాదాలతో పాపులర్ అయిన మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని మూవీ మూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఒసెపచ్చన్‌ ఒళకుంజి నిర్మాతగా వ్యవహరించిన ‘ఒరు అదార్ లవ్’ త్వరలో విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.