యాప్నగరం

ఎన్టీఆర్‌తో ఆ చొరవ ఉంది.. అందుకే అలా పిలుస్తా: త్రివిక్రమ్

త్రివిక్రమ్ తనకు 12 ఏళ్లుగా తెలుసని, తమది చాలా దృఢమైన బంధమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలీదని, ‘అరవింద సమేత’ సినిమాతో అందరికీ తెలుస్తోందని వెల్లడించారు.

Samayam Telugu 7 Oct 2018, 5:02 pm
‘నువ్వే కావాలి’ సినిమా తరవాత నుంచి ఎన్టీఆర్ తనకు తెలుసని, నేరుగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడేంత చొరవ తనకు ఉందని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Samayam Telugu NTR-Trivikram-Film-Shooting


తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ తమ అనుబంధం గురించి వెల్లడించారు. త్రివిక్రమ్ తనకు 12 ఏళ్లుగా తెలుసని, తమది చాలా దృఢమైన బంధమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలీదని, ‘అరవింద సమేత’ సినిమాతో అందరికీ తెలుస్తోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్‌ను స్వామి అని ఎన్టీఆర్ పిలవడం గురించి ప్రశ్నించగా.. ఆయనే మొదట తనను స్వామి అని పిలిచారని, దాంతో తాను కూడా అలాగే మొదలుపెట్టానని ఎన్టీఆర్ చెప్పారు.

ఇక వీరిద్దరి బంధం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నువ్వేకావాలి సినిమా తరవాత నాకు ఎన్టీఆర్ పరిచయమయ్యారు. నేను నేరుగా వాళ్లింటికి వెళ్లిపోయేవాడిని. తను వయసులో నాకన్నా చాలా చిన్నవాడు. చిన్నవాడిని ఏవండీ అని పిలవలేం. అందుకే స్వామి అని పిలిచాను. ఆయన కూడా నన్ను అలాగే పిలవడం మొదలుపెట్టాడు’ అని త్రివిక్రమ్ వెల్లడించారు. ఎన్టీఆర్‌కు ఒకసారి కథ చెబితే చాలని, ఇక ఆ తరవాత ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని త్రివిక్రమ్ అన్నారు. నటన గురించి ఆయన మనం చెప్పాల్సిన పనిలేదని, ఒక్కసారి సీన్ చెబితే ఆయనే చేసుకుంటూ పోతారని నవ్వుతూ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.