యాప్నగరం

Naga Jhansi Boyfriend: ప్రియుడు వేధింపుల వల్లే నటి ఝాన్సీ ఆత్మహత్య

వారం రోజుల కిందట హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రియుడే ప్రధాన నిందితుడని తేలింది.

Samayam Telugu 13 Feb 2019, 1:56 pm

ప్రధానాంశాలు:

  • నటి నాగఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడి వేధింపులే కారణం.
  • ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ప్రియుడు సూర్యతేజ.
  • పెళ్లి చేసుకోవాలంటే నటించడం మానేయ్యాలన్న ప్రియుడు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tvactress_2645
టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజ వేధింపులే కారణమని పోలీసులు విచారణలో తేలింది. ఆమె ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా కన్నేర్రజేయడం, అనుమానించడమే కాదు, నటనకు కూడా దూరంగా ఉండాలని ఆంక్షలు విధించాడని, మరొకర్ని పెళ్లిచేసుకోడానికి సిద్ధపడం వంటి పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన సూర్యతేజ స్థానికంగా మొబైల్ షాప్ నిర్వహిస్తుంటాడు. గతేడాది ఏప్రిల్‌లో స్నేహితుల ద్వారా నాగఝాన్సీకి సూర్య పరిచయమయ్యాడని, తక్కువ కాలంలోనే వారి పరిచయం ప్రేమగా మారిందని తెలిపారు. దీంతో అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఝాన్సీ, ఈ విషయాన్ని తన తల్లికి జులైలో తెలియజేసిందన్నారు. దీనికి ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారని, ఆగస్టులో సూర్యతేజ ఇంటికెళ్లిన నాగఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందని అన్నారు.
అంతేకాదు నవంబరులో సూర్య పుట్టిన రోజుకు బైక్‌ కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చిందని పేర్కొన్నారు. జనవరి 27న హైదరాబాద్‌‌లో ఝాన్సీ ఇంటికి వచ్చిన సూర్య, ఆమెనే వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే, మీ అమ్మానాన్నలను ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తామని ఆ సందర్భంలో ఝాన్సీ తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీనికి సరేనన్న సూర్య, ఆమె కూడా నటించడం మానేస్తే వారిని ఒప్పిస్తానని షరతు విధించాడు. ఒప్పందం మేరకు నటనకు దూరంగా ఉన్న ఝాన్సీ, బ్యూటీ పార్లర్‌ ప్రారంభించింది. అయినా సరే సూర్యతేజ తరచూ ఆమెను అనుమానిస్తూ ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా వేధించేవాడు. ఒక దశలో కావాలనే నిర్లక్ష్యం చేయడం, ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టడం చేశాడు.

ఈ పరిణామాలను తట్టుకోలేకపోయిన ఝాన్సీ, ఆత్మహత్యకు ముందు ఐదు రోజులపాటు ఇంట్లో ఒంటరిగా గడిపిందని వివరించారు. వీటి గురించే ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి లోనైన సమయంలోనే సూర్యతేజ మరొకరితో పెళ్లిచూపులకు సిద్ధమవుతున్నాడని తెలుసుకుని మరింత కుంగిపోయి, ఫిబ్రవరి 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ప్రేమిస్తున్నట్లు నటించి నమ్మక ద్రోహం చేయడం, అన్నింటినీ మించి అతడి కారణంగా తనకు ఎంతో ఇష్టమైన నటనకు దూరంకావడంతో లాంటి పరిణామాలు ఝాన్సీ ఆత్మహత్య వైపు పురిగొల్పాయని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.