యాప్నగరం

బాలీవుడ్ నటుడు టామ్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు, రచయిత, జర్నలిస్ట్ టామ్ ఆల్ట‌ర్ (67) కన్నుమూశారు.

TNN 30 Sep 2017, 10:26 am
ప్రముఖ బాలీవుడ్ న‌టుడు, రచయిత, జర్నలిస్ట్ టామ్ ఆల్ట‌ర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా చర్మ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చర్మ క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉండడంతో రెండు వారాలుగా ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం నుండి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో వైద్యులు ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Samayam Telugu veteran actor and padma shri awardee tom alter dies at 67
బాలీవుడ్ నటుడు టామ్ కన్నుమూత


కాగా, ఇండియా షో బిజ్ ప్రోగ్రామ్ ద్వారా టామ్ ఆల్టర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. బాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్ ప్రోగ్రామ్స్‌లో ఆయన నటించారు. మౌలానా ఆజాద్, మీర్జా ఘాలిబ్ పాత్రలతో రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించిన ఆయన 1976లో చరస్ మూవీతో వెండి తెరకు పరిచయమై 300 పైగా చిత్రాల్లో నటించారు. లోక్ నాయక్, కర్మ, క్రాంతి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కేవలం నటుడిగానే కాకుండా.. 1980 నుంచి 1990 వరకూ ఆయన స్పోర్ట్ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా సంతతి చెందిన ఆయనకు హిందీ, ఉర్దూ భాష‌ల‌పై మంచి ప‌ట్టు ఉంది. రచయితగా ఆయన ఒక నాన్-ఫిక్షన్, రెండు ఫిక్షన్ పుస్తకాలు రాశారు. 2008లో కళలు, సినీరంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారం ప్రదానం చేసింది. ఆల్టర్ చివ‌రిగా 2017లో వచ్చిన స‌ర్గోషియా సినిమాలో కనిపించారు. ‘వన్ నైట్ కింగ్’, ‘గాంధీ’ వంటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. టామ్ ఆల్టర్ మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.