యాప్నగరం

ఎన్టీఆర్ కోసమే వచ్చా.. ఇది నాకో అవకాశం: వెంకయ్య

సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు సినిమా కార్యక్రమాలకు రారు. ఆ నియమ నిబంధనలు ఎలా ఉన్నా నేను తప్పనిసరిగా రావాలని అనుకోవడానికి కారణం ఉంది.

Samayam Telugu 29 Mar 2018, 11:39 am
‘సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు సినిమా కార్యక్రమాలకు రారు. ఆ నియమ నిబంధనలు ఎలా ఉన్నా నేను తప్పనిసరిగా రావాలని అనుకోవడానికి కారణం ఉంది. నందమూరి తారక రామారావు గారంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది. వ్యక్తిగతంగా స్నేహం ఉంది. ఆయన చేసిన పనులు చరిత్ర గుర్తుంచుకోదలచిన పనులని నేను భావిస్తున్నాను. అందుకే ఈవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’ చిత్రం నేడు (మార్చి 29న) ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశం చిత్రీకరణ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Samayam Telugu Venkaiah_NTR

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘రామారావు చరిత్రను సృష్టించారు. ఆయన చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోవాలంటే చరిత్ర సృష్టించడం ఎంత అవసరమో చరిత్ర రాయడం, ఆ చరిత్రను సినిమాగా తీయడం, చరిత్రను మిగతావాళ్లకు తెలియజెప్పడం కూడా చాలా అవసరం. దాని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ ఈ సినిమాను చేస్తుండటం మరో విశేషం. తండ్రి నిర్వర్తించిన నిజమైన పాత్రను సజీవంగా మళ్లీ మనముందు చూపించే ప్రయత్నం కుమారుడు చేయడం బహుశా దేశ చలనచిత్ర రంగంలో, అలాగే దేశ చరిత్రలో వినూత్న అధ్యాయానికి దారి చూపిస్తుందని నేను భావిస్తున్నాను’ అని వెంకయ్య కొనియాడారు.
సినిమా చాలా శక్తివంతమైన సాధనమని, అది మనుషుల్ని ప్రభావితం చేస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. సమాజంలో మార్పులు తెచ్చేందుకు కూడా సినిమా ఉపయోగపడుందన్నారు. మంచి సినిమా అయితే మంచి మార్పులు, చెడు సినిమా అయితే చెడు మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. అలాంటి సాధనంతో నందమూరి తారకరామారావు చరిత్రను సినిమాగా తీయడం చాలా సంతోషం అన్నారు. తనకు మనసులో చాలా సంతోషంగా ఉందని వెంకయ్య చెప్పారు. ‘బాలకృష్ణ నాకు ఈ విషయం చెప్పగానే నేను ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎలా అయినా సరే సర్దుబాటు చేసుకుని వస్తానని చెప్పాను. సరే పార్లమెంటు కూడా జరగడంలేదు. జరుగుతున్నా జరగడంలేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. అది వేరే విషయం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ చక్కని అవకాశంగా నేను భావిస్తున్నాను’ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.