యాప్నగరం

ఐసోలేషన్ వార్డులుగా కేరళ హౌస్ బోట్ లు!

పర్యాటకులకు ఆహ్లాదకరమైన విహారాన్ని, వసతిని అందించిన కేరళ హౌస్ బోట్ లు ఇప్పుడు కరోనా రోగులను రక్షించేందుకు సిద్ధమవుతున్నాయి. విలాసవంతమైన సౌకర్యాలను అందించే ఈ హౌస్ బోట్ లను ఐసోలేషన్ వార్డులుగా కూడా వినియోగించనున్నారు.

Samayam Telugu 17 Apr 2020, 6:14 pm
భారత దేశంలో అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇక్కడి ప్రకృతి అందాలు, పర్యాటక ఆకర్షణలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కేరళ బ్యాక్ వాటర్స్ లో హౌస్ బోట్ ప్రయాణం ఎన్నో మరపురాని అనుభవాలను అందిస్తుంది. అటువంటి కేరళ రాష్ట్రం కొన్ని నెలల క్రితం భారత దేశంలోనే మొట్టమొదటి కరోనా వైరస్ కేసును నమోదు చేసింది. అప్పటి నుండి కేరళ రాష్ట్రం ఈ వైరస్ మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో కేరళ పర్యాటకంలో ఎంత కీలకమైన హౌస్ బోట్ లను కూడా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వినియోగించనున్నట్లు తెలుస్తుంది.
Samayam Telugu కేరళ హౌస్ బోట్


రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి త్వరలో హౌస్ బోట్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.అంజనా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స అందించడానికి తగిన సౌకర్యాలు మరియు సిబ్బంది ఉన్నాయన్నారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య మరింత పెరిగితే అనేక పడకలు ఉన్న హౌస్ బోట్ లను ఉపయోగించుకుంటామని ఆమె తెలిపారు. సామాజిక దూరానికి కూడా ఇవి ఎంతో అనువుగా ఉంటాయి.

రాష్ట్రం ప్రస్తుతం పర్యాటక కార్యకలాపాలు లేనందున హౌస్ బోట్ లు రేవుల్లోనే ఉన్నాయి. కాబట్టి అవసరమైతే వీటిని వినియోగించుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు. హౌస్ బోట్ లను COVID-19 ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి వస్తే ఒకటి లేదా రెండు ప్రదేశాలను గుర్తించి అక్కడ క్లస్టర్ చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి జి.సుధారకరన్ తెలిపారు.

Read Also: నో టూరిజం వార్తలను ఖండించిన కేరళ

ప్రస్తుతం అలెప్పీ వద్ద హౌస్ బోట్స్ లో కనీసం 2000 ఐసోలేషన్ వార్డులను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశం దాదాపు 700 లైసెన్స్ కలిగిన హౌస్ బోట్ లకు నిలయం. హౌస్ బోట్ యజమానులు ఈ ప్రతిపాదనను అంగీకరించారని, అవసరమైతే ఐసోలేషన్ వార్డులుగా వాడటానికి ఏప్రిల్ చివరి నాటికి హౌస్ బోట్ లు సిద్ధంగా ఉంటాయని సుధారకన్ తెలిపారు. హౌస్ బోట్ లు కొన్ని లగ్జరీ బసలను కూడా అందిస్తాయి. ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించడానికి ఇవి సరిగ్గా ఉపయోగపడతాయి.

తాజా నివేదికల ప్రకారం కేరళ రాష్ట్రంలో 387 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృత్యు వాత పడ్డారు. 211 మంది కోలుకుని సురక్షితంగా ఇళ్లకు వెళ్లడం జరిగింది. అనేక మంది ప్రవాసులు స్వదేశమైన కేరళకు తిరిగి వస్తారని, కేసుల సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు అత్యవసర సన్నాహాలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. యుఏఈలో మాత్రమే 3 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వారిలో ⅓ వ వంతు కేరళ రాష్ట్రానికి చెందిన వారే. అందువలనే రాష్ట్రం ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది.

Read Also: నందాదేవి నేషనల్ పార్క్ లో కనిపించిన అరుదైన మంచు చిరుతలు

రాష్ట్రం కష్ట కాలంలో ఉన్న ప్రతి సారి హౌస్ బోట్ లు ఎంతో ఉపయోగపడ్డాయి. 2018 భారీ వరదల్లో ప్రజలను రక్షించడానికి హౌస్ బోట్ లను వినియోగించారు. దాదాపు 30000 మంది ప్రజలను తరలించడంలో ఇవి సహాయపడ్డాయి. కరోనా వైరస్ అత్యవసర పరిస్థితుల్లో కూడా హౌస్ బోట్ లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.