యాప్నగరం

ఈ దండకారణ్యంలోనే సీతారాములు 13 ఏళ్లకు పైగా నివసించారు

రామాయణంలో సీతారాములు అరణ్యవాసంలో పడిన కష్టాల గురించి అందరూ వినే ఉంటారు. వీరు అత్యధిక కాలం గడిపిన అరణ్యం ఒకటి మనకు దగ్గర్లోనే ఉంది. అదెక్కడో తెలుసా?

Samayam Telugu 3 Apr 2020, 12:04 pm
రామాయణ గ్రంధం ప్రకారం వేల సంవత్సరాల క్రితం అయోధ్య యువరాజు శ్రీరాముడు, ఆయన భార్య సీతాదేవి మరియు సోదరుడు లక్ష్మణుడు వనవాసం సమయంలో చిత్రకూట్ ప్రాంతం నుండి భారతదేశంలోని భారీ దండకారణ్యానికి పర్వతారోహణ చేస్తూ వెళ్లారు.
Samayam Telugu lord rama and his wife sita lived many years in dandakaranya forest bastar
ఈ దండకారణ్యంలోనే సీతారాములు 13 ఏళ్లకు పైగా నివసించారు


వీరు ముగ్గురూ 13 సంవత్సరాలకు పైగా ఈ అందమైన, భయం కలిగించే అడవిలో గడిపారు. ఇది ఆ సమయంలో రాక్షసుల ప్రదేశంగా కూడా పిలువబడేది. కట్ చేస్తే 2020లో ఈ పురాణ ప్రాముఖ్యత గల ప్రాంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా పరిధిలో ఉంది.

​దండకారణ్య

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో తూర్పు కనుమలు, అభుజ్మర్ కొండల నుండి ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందించే ఈ పీఠభూమి దాదాపు 92000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మహాభారతం, రామాయణం వంటి ఎన్నో పురాణ గాధలకు, వృత్తాంతాలకు ఈ అటవీ ప్రాంతం సాక్ష్యంగా నిలుస్తుంది.

బస్తర్ రాయ్ పూర్ నుండి 264 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశంలో అత్యంత పర్యావరణ హితమైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఇది ఖ్యాతినార్జించింది. ఈ ప్రాంతంలో సంవృద్ధిగా అడవులు, వన్యప్రాణులు, జలపాతాలతో పాటు పురాణ ప్రాముఖ్యత గల పురాతన దేవాలయాలు, రాజభవనాలు, అరుదైన గిరిజన తెగలు ఉన్నాయి. ఈ చారిత్రక ప్రాంతానికి వెళ్లాలనుకునే పర్యాటకులు చూడాల్సిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

​బస్తర్ ప్యాలెస్

బస్తర్ ప్యాలెస్ జగదల్పూర్ లో ఉంది. ప్రజలకు ఉపయోగపడే విధానాల కారణంగా రాజా భంజ్ డియో అక్కడి ప్రజలచే దైవంగా కీర్తి పొందాడు. ఈ ప్యాలెస్ ఆకట్టుకునే కళలు, నిర్మాణ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. బస్తర్ రాజ వంశానికి చెందిన వారు ఇప్పటికీ ఈ ప్యాలెస్ లో ఓ పోర్షన్ లో ఉంటున్నారు. బస్తర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు ఈ ప్యాలెస్ ను తప్పక వీక్షించాలి.

​దంతేశ్వరి ఆలయం

దుర్గాదేవికి సంబంధించి అత్యంత పవిత్రమైన శక్తిపీఠ ఆలయాల్లో దంతేశ్వరి ఆలయం ఒకటి. జగదల్పూర్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దంతెవాడలో ఈ ఆలయం ఉంది. హిందూ దేవత అయిన సతీదేవి యొక్క దంతాలు ఈ ఆలయ ప్రదేశంలో పడ్డాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ పూజలందుకుంటున్న అమ్మవారిని దంతేశ్వరిగా భక్తులు కొలుస్తారు. బస్తర్, కాకతీయ రాజ వంశాలకు ఈ అమ్మవారు కుల దేవత.

​జలపాతాలు

బస్తర్ ఎన్నో అందమైన జలపాతాలకు నిలయం. ముఖ్యంగా ఇక్కడ గుర్రపు డెక్క ఆకారంలో ఉండే చిత్రకూట్ జలపాతం భారతదేశంలోనే అత్యంత విశాలమైన జలపాతంగా ప్రసిద్ధి చెందింది. మరో అందమైన జలపాతం తిరత్ ఘర్ బస్తర్ లోని కంగెర్ ఘటిలో ఉంది. ఇక్కడ అద్భుతమైన శివ పార్వతుల ఆలయం ఒకటి ఉంటుంది. కంగెర్ ధార, చిత్ర ధార, మండవ, తమడ ఘుమర్ వంటి జలపాతాలను సందర్శించడం ద్వారా టూరిస్టులు గొప్ప అనుభవాన్ని పొందుతారు.


Read Also: శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం... ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?

​ప్రాచీన గుహలు

బస్తర్ లో కుటుంసర్ మరియు కైలాష్ వంటి ప్రదేశాలు సహజసిద్ధ గుహలకు ప్రసిద్ధి చెందాయి. కుటుంసర్ గుహలు ఆశ్చర్యకరంగా పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. జగదల్పూర్ కు సమీపంలో కంగెర్ అటవీ ప్రాంతంలో ఇవి ఉన్నాయి. కైలాష్ గుహలు కుటుంసర్ కు దగ్గర్లో ఉన్నాయి. ఈ రెండు గుహల్లోనూ సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం కనిపిస్తుంది. వీటితో పాటు దండక్ గుహ, కార్పన్ గుహ, కంగెర్ గుహ, దేవ్ గిరి గుహ వంటి ఎన్నో పురాతన గుహలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

​ఇతర ప్రదేశాలు

బస్తర్ లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి భైంసా దర్హ సరస్సు. ఇది మొసళ్ళు, తాబేళ్లకు నివాసం. మీరు బస్తర్ లోని అతిపెద్ద కృత్రిమ సరస్సు ను చూడాలనుకుంటే దల్పత్ సాగర్ సరస్సు వైపు వెళ్లండి. ఈ జిల్లాలో ప్రముఖ మానవ శాస్త్ర మ్యూజియం, కంగెర్ వ్యాలీ నేషనల్ పార్క్, బైరంగర్ వన్యప్రాణుల అభయారణ్యం వంటి అనేక పర్యాటక ఆకర్షణలను సందర్శించవచ్చు.


Read Also: అద్భుతం... ఈ దేశాల్లో సూర్యుడు అస్తమించడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.