యాప్నగరం

రామప్ప ఆలయం.. ఎన్నో అద్భుతాలకు నిలయం!

వరంగల్ జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి.

Samayam Telugu 27 Aug 2018, 3:07 pm
రంగల్ జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ‘రామప్ప’ అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు.
Samayam Telugu Untitledaq


గర్భాలయంలో సహజ వెలుతురు: సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. కానీ, రామప్ప ఆలయంలోని గర్భాలయంలో రాత్రివేళల్లో మినహా రోజంతా వెలుతురు ఉంటుంది. ఇందుకు ఆలయంలో నిర్మించిన స్తంభాలే కారణం. బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుడిని ఎటువైపు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది.

నీటిలో తేలే ఇటుకలు: ఈ శివాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ దొరికిన రాతిశాసనాల్లో ఉంది. ఈ ఆలయం నిర్మాణం పూర్తికావడానికి 40 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అద్భుత శిల్పకళ కట్టిపడేస్తుంది. ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు.. నీళ్లలో వేస్తే తేలుతాయట.

సప్తస్వరాలు పలికే శిల్పం: ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం.. సప్తస్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమపదనిసలు పలుకుతుంది. మరో శిల్పంలో ముగ్గురు వ్యక్తులకు కలిపి.. నాలుగు కాళ్లు ఉంటాయి. ఈ విగ్రహాన్ని చూడగానే కాసేపు అక్కడే ఆగిపోతాం. కాకతీయుల నాటి అద్భుత సాంకేతిక నైపుణ్యం గురించి తెలపడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం ఉంటుంది, చెప్పండి!

మరెన్నో అద్భుతాలు: రామప్ప ఆలయానికి ఇరువైపులా కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం నక్షత్రాకారం గద్దెపై ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన 526 ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఆలయం లోపల గల నల్ల రాతి స్తంభాలపై మలచిన పురాణగాథల శిల్పాలు అద్భుతహా అనిపిస్తాయి. గోపికా వస్త్రాపహరణం మొదలుకుని నరకాశుర వధ వరకు ఎన్నో గాథలను ఈ రాతి స్తంభాలపై చూడొచ్చు.

ఇలా చేరుకోవాలి: రామప్ప దేవాలయం.. వరంగల్‌కు 68 కిమీలు, హైదరాబాద్‌కు 257 కిమీల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు నిత్యం బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వసతి కోసం అక్కడ పర్యాటక శాఖవారి హరిత హోటల్స్ అందుబాటులో ఉంటాయి.
రామప్ప ఆలయాన్ని ఈ వీడియోలో చూడండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.