యాప్నగరం

Taj Mahal Free Entry: మూడు రోజులు తాజ్ అందాలను ఫ్రీగా చూడొచ్చు.. షాజహాన్, ముంతాజ్ సమాధులు కూడా..

ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను (Taj Mahal Free Entry) మూడు రోజుల పాటు ఉచితంగా చూడొచ్చు. ఫిబ్రవరి 17 నుంచి 19 తేదీల మధ్య ఈ అవకాశం దక్కనుంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 16 Feb 2023, 4:29 pm
మొఘల్ చక్రవర్తి షాజహాన్ 368వ వర్ధంతి సందర్భంగా ఆగ్రాలోని తాజ్ మహల్‌ వద్ద ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు ఉర్సు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఉచితంగా తాజ్ మహల్ అందాలను వీక్షించే అవకాశం దక్కింది. ఏటా ఫిబ్రవరి నెలలో షాజహాన్ వర్ధంతి సందర్భంగా ఈ ఉర్సు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి. అలాగే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 17 నుండి 19 వరకు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో టూరిస్టులు మూడు రోజుల పాటు తాజ్ అందాలను ఉచితంగా అనుభూతి చెందే అవకాశం దొరికింది. (Photo Credit: Unsplash)
Samayam Telugu tajmahal-thumb


మరోవైపు ఈ సమయంలో సందర్శకులు షాజహాన్, ముంతాజ్‌ల సమాధులు చూసే అవకాశం కూడా ఉంది. సహజంగా ఇతర దినాల్లో పర్యాటకులకు ఈ అవకాశం ఉండదు. ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆ కమిటీ నిర్వాహకులు వారి సమాధులను శుద్ధి చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం సందర్శకులకు మూడు రోజుల పాటు షాజహాన్ దంపతుల సమాధులు చూసే అవకాశం కల్పిస్తారు. ఈ విషయంపై స్పందించిన ఉర్సు కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం జైదీ.. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉర్సు కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 17, 19 తేదీల మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రోజులు పర్యాటకులు తాజ్ మహల్‌ అందాలతో పాటు షాజహాన్, ముంతాజ్‌ల సమాధులు చూడొచ్చని చెప్పారు.

ఈ ఉర్సు కార్యక్రమంలో భాగంగా 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు'గుస్ల్' (సమాధుల శుద్ధి, ప్రత్యేక ప్రార్థనలు) వేడుక నిర్వహించనున్నారు. అలాగే 18న సుగంధ ద్రవ్య పరిమిళాల వేడుకలు నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన 19న ఖుల్ (ఖురాన్‌లోని నాలుగు ముఖ్యమైన అధ్యాయాలను పఠించడం) అనే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అనంతరం ‘చాదర్ పోషి'ని సమర్పిస్తారు. ఈ ఏడాది షాజహాన్ సమాధికి 1,450 మీటర్ల పొడవైన చాదర్‌ను సమర్పిస్తుండటం విశేషం. అయితే, ఈ మూడు రోజులు తాజ్ సందర్శనకు వచ్చేవారిని నిశితంగా తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. సందర్శకుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కర్నీ పకడ్బందీగా తనిఖీ చేస్తారు. తాజ్ ‌ప్రాంగణంలోకి బీడీ, సిగరేట్, పాన్, గుట్కా, మారణాయుధాలు, అగ్గిపెట్టె, పొగాకు ఉత్పత్తులు, పోస్టర్లు, బ్యానర్లు, పుస్తకాలు లైటర్ల వంటి వాటిని అస్సలు అనుమతించరు. దీంతో అక్కడికి వెళ్లాలనుకునేవారు ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది. వీలైతే మీరూ ఈ ఉర్సు కార్యక్రమాన్ని చూడటానికి ప్రయత్నించండి.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.