యాప్నగరం

ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం... ఇక్కడ గోపురం నీడ కింద పడదు

శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

Samayam Telugu 15 Apr 2020, 12:19 pm
కావేరి నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. తమిళనాడులోని పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీకుంటే ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.
Samayam Telugu significance of brihadeshwara temple and how to reach
ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం... ఇక్కడ గోపురం నీడ కింద పడదు



​ఇది చోళుల బురుజు

ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముతరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1010లో రాజరాజు చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూర్ ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.

​శ్రీబృహదీశ్వర ఆలయం

తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ప్రముఖమైనది. చోళ శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారత దేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదీశ్వరాలయం ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

​తంజావూర్ ప్యాలెస్

బృహదేశ్వర ఆలయం కాకుండా తంజావూర్ లో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ బృహదేశ్వర ఆలయానికి ఆనుకుని ఉంది. దీనిని మరాఠాలు నిర్మింక్చారు. ప్యాలెస్ లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, సంగీత మహల్ లకు నిలయం. ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు. ప్యాలెస్ గార్డెన్ లో స్క్వార్ట్జ్ చర్చి కూడా ఉంది. ఇవి కాకుండా తంజావూరులో కుంబకోణం, దరాసురం, గంగైకొండ చోళపురం, తిరువైయారు, తిరుభువనం వంటివి చూడవచ్చు.

​మొదటి రోజున ఇవి చేయండి

మీరు తంజావూరు పర్యటనకు వెళ్లినప్పుడు మొదటి రోజున తంజావూర్ రైల్వే స్టేషన్ నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మధ్యయుగ భారతదేశంలో నిర్మించిన మరియు చోళుల రాజధాని అయిన తంజావూరు, గంగైకొండ చోళపురం వెళ్లే రహదారులను గమనించండి. తంజావూర్ లో మీ హోటల్ కు చేరుకుని అక్కడ అరటి ఆకుల్లో భోజనం చేయండి. ఆ తరువాత రాయల్ ప్యాలెస్ మ్యూజియం, తమిళనాడు విశ్వవిద్యాలయం మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన బృహదేశ్వర ఆలయాలను సందర్శిస్తూ మీ రోజును గడపండి. రాత్రికి మంచి భోజనం చేసి విశ్రాంతి తీసుకొండి.


Read Also: అన్నమాచార్య 108 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారా?

​రెండవ రోజు టూర్

రెండవ రోజు ఉదయాన్నే లేచి వేడి వేడి కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించండి. అల్పాహారం ముగించి నగరం చుట్టూ ఉండే ప్యాలెస్ లు, ఆర్ట్ గ్యాలరీలను చూసేందుకు వెళ్లండి. తంజావూర్ లోని హోటళ్లలో సురుల్ పోలి, మిల్క్ పాయా, కోజుకొట్టై లతో మీ విందును ముగించండి.

​మూడవ రోజు చూడాల్సిన ప్రదేశాలు

మూడవ రోజు ఉదయం రామస్వామి ఆలయంలో దేవుని ఆశీస్సులు పొంది రోజును ప్రారంభించండి. మధ్యాహ్నం మనోరా కోటను సందర్శించండి. తరువాత శ్రీ ఆర్య భవన్ వద్ద అన్నం మరియు కూరలతో రుచికరమైన భోజనం చేయండి. అనంతరం మీ లగేజీను ప్యాక్ చేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.

తంజావూర్ లో ప్రసిద్ధ వంటకాలు

తంజావూర్ లో సంపూర్ణంగా మీ ఆకలిన సంతృప్తిపరచవచ్చు. తంజావూర్ లోని హోటల్స్ లో ఎప్పుడూ అన్నం, ప్రత్యేకమైన సాంబార్, వివిధ రకాల కూరలు, జ్యూస్ లు, పచ్చళ్లు, యోగర్ట్ వంటివి దొరుకుతాయి. అంతే కాదు అల్పాహారంలో దోస, ఇడ్లీ, పరోటా, పొంగల్, పాయా, స్వీట్ పొంగల్ వంటి అనేక రుచులను చూడవచ్చు.


Read Also: దేశంలోనే నాల్గవ అతిపెద్ద మర్రిచెట్టు... బెంగళూరులో ఎక్కడుందో తెలుసా?

​సందర్శనకు మంచి సమయం

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూర్ ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ కాస్త వర్షాలు కురుస్తాయి. అన్ని సీజన్ లతో పోలిస్తే శీతాకాలం తంజావూర్ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

​ఎలా చేరుకోవాలి?

తంజావూర్ తిరుపతికి 412 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 8 గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.

వాయు మార్గం: తంజావూర్ కు సమీప విమానాశ్రయం తిరుచ్చిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్. ట్యాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ రెండు నగరాల మధ్య తరచుగా నడుస్తుంటాయి.

రైలు మార్గం: తంజావూర్ కు సమీప రైల్వే స్టేషన్ గా కూడా తిరుచ్చిరాపల్లి ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, సలేం, మధురైలకు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గం: బెంగళూరు, చెన్నై, మధురై, భువనేశ్వర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి అనేక నగరాల నుండి తంజావూర్ కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు నిరంతరం ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి.


Read Also: కైలాసకోన జలపాతం: పరమశివుడు ధ్యానం చేసిన ప్రదేశం... ఎక్కడుంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.