స్వీట్ షాప్ ఓపెనింగ్‌లో కిరికిరి
ఇంతలో జ్ఞానాంబ.. ‘నిఖిల్ మళ్లీ మన ఇంట్లో అడుగుపెడతాడు కదండీ’ అని అంటే.. తప్పకుండా అడుగుపెడతాడు అని అంటాడు గోవిందరాజులు. ‘త్వరలో అందరి కోరికా తీరబోతుంది అత్తయ్య గారూ.. శుభవార్త చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను అంతే’ అని తనలో తాను అనుకుంటుంది జానకి. ఇక తెల్లారగానే రామా స్వీట్ కొట్టు ఓపెనింగ్.. ఫ్యామిలీ మొత్తం స్వీట్ షాప్ ఓపెనింగ్‌లో సంతోషంగా ఉంటారు. అయితే ఫ్యామిలీ సంతోషంగా ఉంటే.. మల్లిక ఫిటింగ్ పెట్టాలి.. లేదంటే ఊర్లో ఉన్న అమ్మలక్కలు వచ్చి.. జ్ఞానాంబనో.. జానకినో నాలుగు తిట్లు తిట్టి వెళ్లిపోవాలి.. ఇది ఎప్పుడూ ఉండే తంతే కాబట్టి.. నేటి ఎపిసోడ్లో కూడా సేమ్ సీన్. ఓ అమ్మలక్క వచ్చి.. విష్ణు ఏడమ్మా కనిపించడం లేదు అని మల్లికను అడుగుతుంది.
జానకిది అమృత హస్తం.. అభయ హస్తం.. భజన స్టార్ట్
హా.. ఇదేమన్నా.. పోలవరం ప్రాజెక్ట్‌నా అందరూ ఉండటానికి మొదటి భార్యకే రెండో పెళ్లి అని వెటకారంగా మాట్లాడుతుంది మల్లిక. ఇక పెద్ద కోడలు మోజులో ఉన్న జ్ఞానాంబ..‘జానకిది అమృత హస్తం.. అభయ హస్తం’ అంటూ తెగ భజనచేస్తూ ఆమె చేతులతోనే బోణీ చేయాలని చెప్తుంది. మా మాటతో గెస్ట్‌గా వచ్చిన ఊరు పెద్ద హర్ట్ అయిపోతాడు. ‘నీ కోడలిది అంత అమృతహస్తం అయితే.. ఇప్పటివరకూ ఐపీఎస్ ఎందుకు పాస్ కాలేదు.. తన అదృష్టం తనకి కలిసిరాదా? మీ కోడలికి ఎందుకంత బిల్డప్.. ఏదో కలిసి వచ్చింది కాబట్టి.. కానిస్టేబుల్ అయ్యింది.. రాసిపెట్టుకోండి.. మీ కోడలు జీవితంలో ఐపీఎస్ కాదు.. ఊరి పెద్దని పిలిచి మర్యాద చేయడం తెలియదు’ అని ఆవేశపడతాడు ఊరు పెద్దమనిషి అబ్బులు.
తల్లి కాలేని జానకితో బోణీనా?? బయల్దేరాడు పెద్ద మగాడు
పెద్దగా వచ్చారు.. పెద్దరికాన్ని కాపాడుకోండి.. లేదంటే అంటూ రామా.. ఆగ్రహంతో ఊగిపోతుంటే.. కూల్ అని ఆపేస్తుంది జానకి. దీంతో అబ్బులు.. ‘ఏవమ్మా.. జ్ఞానాంబ నీ మూడో కోడలు తల్లి అయ్యింది.. రెండో కోడలు తల్లి అవుతుంది.. నీ పెద్ద కోడలు సంగతి ఏంటి? అలాంటి దానితో బోణీ చేయిస్తావ్ ఏంటని నీ మంచి కోసం చెప్తే.. నాకే మర్యాద తెలియదంటారా? అంటూ పెద్ద మనిషి అబ్బులు నోరు పారేసుకుంటాడు.
దీంతో రామా.. ‘ఏయ్ నీ సంగతి తేలుస్తా’ అని రామా దూసుకుని రావడంతో.. ‘తేల్చావ్ లేవయ్యా.. పెద్ద మగాడివి బయల్దేరావ్’ అంటూ రామా గాలి తీసిపారేస్తాడు అబ్బులు. ఆ తరువాత జ్ఞానాంబ అనుకున్నట్టుగానే.. అబద్దాల జానకి చేతుల మీదుగా స్వీట్ షాప్‌కి బోణీ కొట్టిస్తుంది. ఆ తరువాత సీన్ తెలిసిందే.. భజనా.. భజనా.. చప్పట్లతో జానకి భజన.
‘పాలు తాగండి రామా గారూ’.. మండిపోతుందిక్కడా!!
ఇక ఇంటికి వచ్చిన తరువాత రామా.. అబ్బులు అన్న మాటల్నే తలుచుకుంటూ ఉంటాడు. ఎదవ బిల్డప్ ఎందుకు? జానకి జీవితంలో ఐపీఎస్ కాదు.. నువ్వు పెద్ద మగాడివా అంటూ అబ్బులు అన్న మాటల్ని తలుచుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఇంతలో మన ఐపీఎస్ కానిస్టేబుల్ పాల గ్లాస్‌తో వచ్చి.. ‘రామా గారూ పాలు తాగండీ’ అని అంటుంది. దీంతో రామా.. ‘ఏంటి జానకి గారూ.. వాడు అన్న మాటలకు నేను బాధపడుతుంటే మీరొచ్చి.. పాలు తాగమంటున్నారు’ అని ఎగిరిపడతాడు. కూల్ రామా గారూ.. రోడ్డుపై ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అని గృహలక్ష్మిలో తులసి చెప్పినట్టుగా నీతి సూక్తులు చెప్పుకొస్తుంది జానకి.
అర్జెంట్‌గా ఐపీఎస్నా? ఈ మొగుడు పెళ్లాలు ఐపీఎస్‌ని కామెడీ చేసిపారేస్తున్నారే..
ముందు ఆ కత్తులు నూరడం మానేసి.. ముందు ఈ పాలు తాగండి.. అని రామా చేతిలో పాలగ్లాస్ పెడుతుంది జానకి. ఇక పాల గ్లాస్ అందుకున్న రామా.. ‘మీరు అర్జెంట్‌గా ఐపీఎస్ అయిపోండి జానకి గారూ.. చదివేయండి.. ఈ క్షణం నుంచి మీరు అన్ని పనులూ మానేయండి.. మీరు ఈరోజు నుంచి గదిలో నుంచి బయటకు రావడానికి వీళ్లేదు.. నేను ఎవరి మాటా వినను.. వెంటనే మీరు ఐపీఎస్ అయిపోవాల్సిందే’ అని అంటాడు. ఆ మాటతో జానకి.. శాంతించండి రామా గారూ.. మీరు అన్నట్టుగానే ఐపీఎస్ అవుతాను.. కానీ ఇప్పుడు కాదు.. ఒక్క ఏడాది తరువాత అని అంటుంది జానకి. ఏడాది తరువాతా? అప్పటి వరకూ ఏం చేస్తారు జానకి గారూ.. మీరు వెంటనే ఐపీఎస్ అవ్వాలి అంతే’ అని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు రామా.
నేను నెల తప్పినట్టు చెప్పనుగా.. గొప్పదానివే తల్లీ!!
దీంతో జానకి.. నేను ప్రెగ్నెంట్రా మొగుడా అని చెప్పకుండా.. తనకున్న జబ్బు ప్రకారం తనలో తానే మాట్లాడుకుంటుంది. ‘రామా గారికి నేను నెల తప్పిన విషయం చెప్పితే.. ఏడాది పాటు నన్ను కాలు కిందపెట్టనివ్వకుండా చూసుకుంటారు.. కానీ డాక్టర్ గారూ ఒక వారం వరకూ చెప్పొద్దన్నారు.. ఇప్పుడు నేను విషయం చెప్పి.. తరువాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోతే అమ్మో వద్దు తట్టుకోలేరు.. డాక్టర్ గారు కన్ఫామ్ చేశాకే ఈ విషయం చెప్పాలి.. అప్పటి వరకూ మౌనంగా ఉండాలి’ అని అనుకుంటుంది జానకి. ఈమె నెల తప్పడం ఏంటో.. అది భర్త దగ్గర చెప్పకుండా దాచడం ఏంటో.. ఈ సాగదీత ఏమిటో.. అన్నట్టుగా ఉంటుంది ఈ సీన్. ఇక రేపటి ఎపిసోడ్లో మన వీర వనిత జానకి.. ప్రియ అనే విద్యార్ధి జీవితం వెలుగు నింపుతుంది. ఆ నాటకీయం తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.