యాప్నగరం

రూ.515తో బీరు తాగి.. రూ.2 లక్షలు టిప్‌గా ఇచ్చాడు, ఎందుకంటే...

మీరు రెస్టారెంట్‌కు వెళ్తే ఎంత టిప్ చెల్లిస్తారు? అయితే, ఆ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలకు పైగా టిప్ చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన అలా ఎందుకు చేశాడంటే..

Samayam Telugu 27 Nov 2020, 12:45 pm
కొంతమంది కస్టమర్లు రెస్టారెంటులో భోజనం చేసిన తర్వాత టిప్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. కొందరు రూ.10 ఇచ్చి.. ఆ రెస్టారెంట్ సిబ్బందికి తానే జీతాలు చెల్లిస్తున్నంత బిల్డప్ ఇస్తారు. అయితే, ఈ కస్టమర్ దేవుడు.. నిజంగా దేవుడు. ఎందుకంటే.. ఆ బారులో బీరు తాగడమే కాకుండా, రూ.2.21 లక్షలు టిప్‌గా చెల్లించాడు. ఇదేదో తాగిన మత్తులో చేసిన పని కాదు. స్పృహతో ఓ మంచి పని కోసమే అతడు ఆ టిప్ ఇచ్చాడు.
Samayam Telugu Image: Pixabay


కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికీ కొన్ని సంస్థలు పూర్తిగా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని క్లేవేల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్‌ యజమాని బ్రెంన్డాన్ రింగ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: భయానకం.. విమానం అద్దం పగిలి ఎగిరిపోయిన పైలట్, 23 వేల అడుగుల ఎత్తులో...

ఈ సందర్భంగా బ్రెంన్డాన్ మాట్లాడుతూ.. ‘‘మా నైట్ టౌన్ రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్ చెల్లించిన బిల్లు ఇది. ఆయన 7.02 డాలర్లు (రూ.515) విలువ చేసే బీరు తాగారు. అయితే, బిల్లులో ఆయన అదనంగా మరో 3 వేల డాలర్లు (రూ.2.21 లక్షలు) టిప్‌ ఇస్తున్నట్లు ఆ బిల్లులో రాశారు. అది చూడగానే మేమంతా ఆశ్చర్యపోయాం. నేను వెంటనే ఆయన వద్దకు వెళ్లి పొరపాటున 3 వేల డాలర్లు టిప్‌గా ఇస్తున్నారని చెప్పా. ఇందుకు ఆయన స్పందిస్తూ.. మీరు మళ్లీ బార్‌ను ‘రీఓపెన్’ చేశాక కలుద్దామని నవ్వుతూ చెప్పారు’’ అని తెలిపాడు.

Read Also: ఒక్క రూపాయికే విమాన టికెట్.. ఆ సంస్థ ఇప్పుడు ఏమైంది? అసలు కథ ఇదీ!

‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో బార్ నడపడం ఎంతో కష్టంగా ఉంది. ఇప్పటివరకు ఆదుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేను ఆయన పేరును ఇక్కడ తెలపవచ్చు. కానీ, అది ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ, నేను.. నా సిబ్బంది ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం. ఆయన ఎంతో దయతో మమ్మల్ని ఆదుకున్నారు’’ అని తెలిపాడు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందుల్లో తమ రెస్టారెంట్‌ సిబ్బందిని ఆదుకోడానికే ఆయన అంత మొత్తాన్ని టిప్‌గా చెల్లించారని బ్రెంన్డాన్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఈ లోకంలో ఇంకా ఇలాంటి మంచివాళ్లు ఉండటం నిజంగా గ్రేట్ కదూ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.