యాప్నగరం

ఆరు రోజులు కారులో బందీ.. వర్షమే ఆమెను రక్షించింది!

రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె.. కదల్లేని పరిస్థితిలో కారులోనే బందీ అయ్యింది. వర్షం వల్ల ప్రాణాలు దక్కించుకుని ఇలా బయటపడింది.

Samayam Telugu 3 Aug 2019, 9:03 pm
ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళను వర్షం నీరే ఆదుకుంది. ఆరు రోజులపాటు ఆహారం లేకున్నా.. చూయింగ్ గమ్ డబ్బా, వర్షం నీరు ఆమె ప్రాణాలు కాపాడాయి. బెల్జియంకు చెందిన కొరిన్ బాస్టిడ్ (45) నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డుకు దిగువున ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె నడుము విరిగింది. కారు అద్దాలు ఆమె వెన్నులో గుచ్చుకున్నాయి.
Samayam Telugu women_driving_1516783091


అది నిర్మానుష్య ప్రాంతం కావడం వల్ల ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆమె ఆరు రోజులపాటు కారులోనే బందీ అయ్యింది. కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె కారు నుంచి బయటకు రాలేకపోయింది. తీవ్రమైన దప్పికతో అల్లాడింది. దీంతో కారులోకి దూసుకొచ్చిన మొక్కల కొమ్మలు విరిచి నోట్లో పెట్టుకుని నాలుక తడి చేసుకునేది. అయితే, మధ్య మధ్యలో కురిసిన వర్షం వల్ల ఆమె ఆ ఆరు రోజులు ప్రాణాలు కాపాడుకోగలిగింది. కారులో ఉన్న చూయింగ్ గమ్ డబ్బాలో ఆ వర్షం నీరు పట్టుకుని దాహం వేసినప్పుడల్లా తాగేది.

మరోవైపు కొరిన్ ఆచూకీ తెలియక ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఫోన్ చేసినా కొరిన్ నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె ప్రయాణించి లీజ్ ప్రాంతాన్ని జల్లెడ పట్టడంతో ఎట్టకేలకు ఆమె ఆచూకీ లభించింది. పోలీసులు, కుటుంబికులు ఆమెను కారు నుంచి బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కొరిన్ మాట్లాడుతూ.. ‘‘నా వెనుక భాగంలో అద్దాలు గుచ్చుకున్నాయి. నడుము విరగడం వల్ల కదల్లేకపోయాను. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం నాకు వినిపించేది. కానీ, నా అది చేతికి అందనంత దూరంలో పడటం వల్ల సమాధానం చెప్పలేని పరిస్థితి. నా పిల్లలను గుర్తు తెచ్చుకుని, వారి కోసమైనా బతకాలనే ధైర్యంతో సాయం కోసం ఎదురు చూశాను. రాత్రి వేళ చిమ్మచీకట్లో నరకం చూశాను’’ అని తెలిపింది.
Photo credit: Unsplash

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.