యాప్నగరం

చెట్లకు కాయని ఈ మామిడి పండ్లు.. చాలా ఖరీదు గురూ!

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఈ మామిడి పండు ధర వింటే గుండె గుబేల్ అంటుంది. ఎందుకంటే.. వీటిని పెంచే విధానం అలాంటిది మరి!

Suresh Chelluboyina | Samayam Telugu 27 Feb 2019, 7:37 pm
మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. సాధారణ మామిడి కాయల తరహాలో ఇవి పెద్ద పెద్ద చెట్లకు పండుతాయని అనుకుంటే పొరపాటే. ఇవి కేవలం చిన్న చిన్న కుండీల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని మామిడి చెట్టు అని పిలవడం కంటే.. మామిడి మొక్కలు అనడం బెటర్. ఎందుకంటే వీటిని చూసేందుకు సాధారణ మొక్కల్లాగానే ఉంటాయి. పండ్లు మాత్రం భళా అనిపిస్తాయి.
Samayam Telugu 111


జపాన్‌లోని మియజాకీలో ఈ మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకే వీటిని మియజాకీ మామిడి పండ్లని అంటారు. అంతేకాదు, రెడ్ మ్యాంగో, ఎగ్ ఆఫ్ సన్ అనే పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన పండ్లగా పేరొందిన ఈ మామిడి పండ్లను సాదాసీదాగా పెంచరు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో మామిడి పండు బరువు 700 గ్రాములు ఉంటుంది. ధర రూ.5 వేలు.
ఇవి సాధారణ మామిడి పండ్ల కంటే 15 రెట్లు తియ్యగా ఉంటాయట. ఈ మామిడి మొక్కలను చెట్లగా ఎదగినివ్వరు. వాటి కొమ్మలను కత్తిరిస్తూ మొక్కలుగా పెంచుతారు. కొత్తగా పుట్టే కొమ్మలకు వచ్చే చిగుళ్లకే మామిడి పూత ఏర్పడుతుంది. అవే కాయలుగా ఏర్పడతాయి. గాలికి పూత రాలిపోకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల ఎక్కువ కాయలు ఉత్పత్తయ్యే అవకాశం ఉంటుంది.

ఈ మొక్కలకు ఉండే కాయలను నేరుగా కొయ్యరు. అవి మొక్కకే పండి రాలిపోతాయి. అవి నేలపై పడి దెబ్బతినకుండా ఉండేందుకు వలలు ఏర్పాటు చేస్తారు. కాయలు ఎదిగిన తర్వాత వాటిని జాగ్రత్తగా వేలాడేలా చూస్తారు. వాటిపై ఎలాంటి మచ్చలు, గీతలు ఏర్పడకుండా కవర్లు చుడతారు. ఈ పండ్లకు ఐరోపా దేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. అక్కడ ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కొంతమంది వీటిని బహుమతులుగా కూడా అందిస్తుంటారు. మీకూ ఈ పండ్లను రుచి చూడాలని ఉందా? అయితే, కొన్నాళ్లు వెయిట్ చేయండి. త్వరలో వీటిని భారత మార్కెట్లో విక్రయించే యోచనలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.