యాప్నగరం

వీడియో: మనుషులతో ఆటలాడుతున్న చిరుత పులి.. ఇదేదో తేడాగా ఉందే!

చిరుత పులి మనుషులతో ఆటలాడటాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.

Samayam Telugu 15 Jan 2021, 1:41 pm
చిరుత పులి ఎంత వేగంగా వేటాడుతుందో తెలిసిందే. దాని పంజా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. చెట్లు, ఎత్తులను సైతం ఎంతో సులభంగా ఎక్కేస్తూ మరీ వెంటాడుతుంది. మరి, అలాంటి చిరుతపులి.. ఎలాంటి హానీ చేయకుండా మనుషులతో పిల్లి పిల్లలా ఆడుకుంటుందని ఎవరైనా ఊహించగలరా? అది అసాధ్యం కదూ. అయితే, మీరు హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ చిరుతపులిని చూస్తే.. తప్పకుండా అభిప్రాయం మార్చుకుంటారు.
Samayam Telugu Image: Twitter/Sanjeev Gupta/Jannat of Himachal


కుల్లులోని తీర్థన్ వ్యాలీలో ఇటీవల ఓ చిరుతపులి బాగా పాపులరిటీ సంపాదించింది. అడవుల మధ్య నుంచి వెళ్లే రోడ్డు మీద నిత్యం అటూ ఇటూ తిరుగుతూ.. పర్యాటకులను పలకరిస్తోంది. నెమ్మదిగా వారిని సమీపించి ఆటలాడుతోంది. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో హిమాచలీ క్యాప్ పెట్టుకున్న ఓ వ్యక్తిని చిరుతపులి సమీపించడమే కాకుండా.. అతడితో ఆటలు ఆడటాన్ని చూడవచ్చు. పర్యాటకులు కూడా ఈ వింతను చూస్తూ.. ఫొటోలు వీడియోలు తీసుకుంటున్నారు.
దీనితోపాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూస్తే కాస్త గుండె బరువెక్కుతోంది. అదే ప్రాంతంలో ఆకలితో ఉన్న ఓ చిరుతపులి.. తినేందుకు ఆహారాన్ని పెట్టాలని వేడుకుంటోందంటూ.. సజీవ్ గుప్తా అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో పర్యాటకులు కేవలం దానితో ఫొటోలు తీసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారని, దాని ఆకలిని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌‌ను ఆయన ఐఎఫ్ఎస్ అధికారులు సుధాన్ రామెన్, ప్రవీణ్ కాశ్వన్, సుశాంత నందాలను ట్యాగ్ చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.