యాప్నగరం

NASA: గ్రహశకలాన్ని ఢీకొట్టబోతున్న నాసా.. తెరవెనక ప్లాన్ ఏంటి?

NASA: మన భూమికి అంతరిక్షం నుంచి ఎన్నో రకాలుగా ఆపద ఉంది. వాటిలో గ్రహశకలాల (Asteroids) సమస్య చాలా పెద్దది. మరి దీన్ని ఎదుర్కోవడానికి నాసా ఏం చేస్తోంది.

Samayam Telugu 25 Nov 2021, 10:04 am
NASA: యావత్ ప్రపంచమంతా మంగళవారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) వైపు చూసింది. ఎందుకంటే... ఓ గ్రహశకలాన్ని (asteroid) బలవంతంగా స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఢీకొట్టించేందుకు నాసా రెడీ అవుతూ... అందుకు సంబంధించి ఓ రాకెట్‌ను అంతరిక్షంలోకి నిన్న పంపింది. ఆ రాకెట్‌లో ఉన్న స్పేస్ క్రాఫ్ట్... గ్రహశకలాన్ని అత్యంత బలంగా ఢీకొట్టనుంది. అసలు నాసా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది... ఇలా చేయడం వల్ల ఉపయోగమేంటి... ఇలా ఢీ కొటితే... ఆ గ్రహశకలం ముక్కలవుతుందా... ముక్కలైతే... ఆ ముక్కల వల్ల భూమికి ప్రమాదం ఉందా... వంటివి విషయాలు తెలుసుకుందాం.
Samayam Telugu మొదలైన నాసా గ్రహశకల ప్రయోగం (image credit - twitter - @NASA)


అదే అసలు కారణమా?
మనం గమనిస్తూనే ఉన్నాం... నెలకు కనీసం రెండు గ్రహశకలాలైనా భూమివైపు వచ్చి వెళ్తున్నాయి. లక్కీగా అవి మన భూమిని ఢీకొనట్లేదు. కానీ మనకు తెలుసు 6.6 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలం ఢీకొట్టడం వల్లే భూమిపై రాక్షస బల్లులు అంతరించిపోయాయి. మళ్లీ అలా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొంటే... మనుషులు సహా జీవరాశి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అంత భారీ నష్టం జరగకపోయినా... గ్రహశకలం ఢీకొట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం... కొన్ని నెలలపాటూ భూ వాతావరణం అంతటా వ్యాపించి... రకరకాల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చేందుకు కారణం కాగలదు. అందుకే... అలా భూమిని ఢీకొట్టేందుకు వచ్చే గ్రహశకలాన్ని అంతరిక్షంలోనే ఢీకొట్టి పేల్చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నాసా వేస్తున్న ట్రయల్ ఇది.

మంగళవారం కాలిఫోర్నియా లోని వాండెన్‌బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నాసా పంపిన రాకెట్ అంతరిక్షం వైపు దూసుకెళ్లింది. ఇందులోని స్పేస్‌క్రాఫ్ట్ డిమోర్ఫోస్ (Dimorphos) అని పిలిచే గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. తద్వారా గ్రహశకలం ముక్కలు కాకపోయినా... దాని డైరెక్షన్‌ని మార్చగలమా లేదా అన్నది నాసా తెలుసుకోవాలి అనుకుంటోంది. ఈ సైన్స్ ఫిక్షన్ లాంటి ప్రయోగం సక్సెస్ అయితే... భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమిని కాపాడేందుకు ఇలాంటి టెక్నిక్‌ని నాసా ఉపయోగించాలి అనుకుంటోంది.


తాజా ప్రయోగం ద్వారా 525 అడుగుల సైజు అంటే... న్యూయార్క్‌లోని స్టాట్యూఆఫ్ లిబర్టీ విగ్రహాలను ఒకదానిపై ఒకటి నిలబెడితే... ఎంత సైజు ఉంటాయో.. అంత సైజులో ఉన్న డిమోర్ఫోస్... పేలుడు తర్వాత తన దిశ మార్చుకొని వెళ్తుందనే అంచనా ఉంది. ఈ గ్రహశకలంతోపాటూ... డిడిమోస్ (Didymos) అనే అతి పెద్ద 2,500 అడుగుల వ్యాసార్థం ఉన్న మరో గ్రహశకలం కూడా ఉంది. ఇవి రెండూ తరచూ సూర్యుడి దగ్గరకు వచ్చి వెళ్తున్నాయి.

ఇంతకీ ఈ పేలుడు ఇప్పుడు జరగదు. 2022లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 మధ్యలో జరుగుతుంది. భూమికి 1.10 కోట్ల కిలోమీటర్ల అవతల జరుగుతుంది. ఆ సమయంలో ఆ రెండు గ్రహశకలాలూ భూమికి అత్యంత దగ్గరగా వస్తాయట. అందుకే అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్టుకు చాలా ఖర్చవుతుంది. అంతరిక్షంలో దూరం ఏ కొద్దిగా తగ్గినా... దాని వల్ల చాలా ఖర్చు తగ్గించవచ్చు. అందుకే నాసా సరైన టైమ్ చూసి పేలుడు జరపబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం నాసా రూ.2,461 కోట్లు ఖర్చుచేస్తోంది.

మన భూమికి ప్రమాదకరంగా ఉన్న గ్రహశకలాల్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ (NEOs)గా నాసా పిలుస్తోంది. ఇవి భూమికి 3 కోట్ల మైళ్ల దూరం లోపల తిరుగుతున్నాయి. వీటిలో చాలా గ్రహశకలాలు 460 అడుగుల కంటే పెద్దగా ఉన్నాయి. వాటిలో ఏదైనా భూమిని ఢీకొంటే... పెద్ద అణుబాంబు పేలినట్లే ఉంటుంది. నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకుపోగలవు. ఇలాంటి గ్రహశకలాలు దాదాపు 10వేల దాకా ఉన్నాయి. వీటిలో ఏదీ కూడా వచ్చే 100 ఏళ్లలో భూమిని ఢీకొట్టే పరిస్థితి లేదు. కానీ... వీటిలో దేన్నైనా మరొకటి ఢీకొంటే... అప్పుడు వాటి దిశ మారి... భూమివైపు రావచ్చు. అందువల్లే నాసా ముందుజాగ్రత్తగా రెడీ అవుతోంది.

స్పేస్‌క్రాఫ్ట్.. గ్రహశకలాన్ని ఢీకొట్టినప్పుడు భూమికి ఏదైనా ఆపద వస్తుందేమో అనే ఆందోళన నెటిజన్లకు ఉంది. అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రపంచ మానవాళికి మేలు చేసే ప్రయోగంగా భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.